1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2023 (12:31 IST)

ఆధార్ - పాన్ అనుసంధానం నేటితో పూర్తి

pan card - aadhaar card
ఆధార్ - పాన్ అనుసంధానానికి కేంద్రం పెట్టిన గడువు శుక్రవారంతో ముగియనుంది. జులై 1వ తేదీ నుంచి ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్‌ ఖాతాలు పనిచేయవు. నిజానికి పాన్‌ - ఆధార్‌ లింకుకు గడువు ఎప్పుడో ముగిసింది. అనంతరం రూ.1000 అపరాధ రుసుముతో తొలి మార్చి 31, ఆ తర్వాత జూన్‌ 30 వరకు అదనపు గడువు కల్పించారు. ఇప్పుడు ఆ సమయం కూడా నేటితో ముగుస్తోంది. అయితే, ఈ గడువును మరోసారి పెంచే అవకాశమున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ.. దీనిపై ప్రభుత్వం మాత్రం ఇంకా స్పష్టతనివ్వలేదు.
 
పాన్‌ - ఆధార్‌ లింక్‌ చేయడం వల్ల బ్యాంకింగ్‌ సేవలను పొందడం, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను వాడడం, ఆన్‌లైన్‌ చెల్లింపులు, యూపీఐ, మొబైల్‌ బ్యాంకింగ్‌ ఇలాంటి సేవలన్నీ ఎలాంటి అవాంతరం లేకుండా పొందాలంటే.. పాన్‌ను ఆధార్‌ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలి. లేదంటే ఈ సేవలకు విఘాతం కలిగే ఆస్కారం ఉంది. 
 
మీకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వచ్చే వడ్డీ, డివిడెండు, ఇతర ఆదాయాలపైనా అధిక మొత్తంలో పన్ను కోత విధించే అవకాశం ఉంది. ఒకసారి ఇలా విధించిన పన్నును తిరిగి వెనక్కి తీసుకునే అవకాశమూ ఉండదు. పనిచేయని పాన్‌తో ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు వీలుండదు. పెండింగ్‌ రిటర్నుల ప్రాసెస్‌ కూడా నిలిచిపోతుంది. పెండింగ్‌ రీఫండ్‌లను జారీ చేయరు. 
 
అయితే కొన్ని కేటగిరీకు సంబంధించిన వ్యక్తులకు పాన్‌తో ఆధార్‌ను లింక్‌ చేయడం తప్పనిసరి కాదని సీబీడీటీ (CBDT) తెలిపింది. 80 ఏళ్ల పైబడిన వ్యక్తులు, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం భారత నివాసి కాని వారు.. భారత పౌరులు కాని వ్యక్తులు దీన్ని లింక్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు.