సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2023 (14:01 IST)

మినిమమ్ బ్యాలెన్స్ లేదన్న సాకుతో రూ.21 వేల కోట్లు దోచుకున్న బ్యాంకులు...

banks
ఖాతాదారుల నుంచి బ్యాంకులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. మినిమమ్ బ్యాలెన్స్ (కనీస నిల్వ) పేరుతో కోట్లాది రూపాయలను దోచుకుంటున్నాయి. ఈ విషయాన్ని సాక్షాత్ కేంద్రమే పార్లమెంట్ వేదికగా బహిర్గతం చేసింది. గత 2018 సంవత్సరం వరకు ఏకంగా రూ.35 వేల కోట్లు దోచుకోగా, ఇందులో రూ.21 వేల కోట్లు కేవలం కనీస బ్యాలెన్స్ లేదన్న సాకుతో అపరాధం రూపంలో వసూలు చేసినట్టు తెలిపింది. 
 
సాధారణంగా బ్యాంకు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ తప్పనిసరి. కనీసం ఇంత మొత్తం పెట్టాలన్న నిబంధన ఒక్కో బ్యాంకు ఒక్కోలా నిర్ణయిస్తాయి. అలా కనీస బ్యాలెన్స్ ఉంచకుంటే అపరాధం పేరుతో చార్జీలు బాదుతున్నాయి. నెలనెలా ఖాతాలో నుంచి డబ్బుు కట్ చేస్తుంటాయి. వీటితోపాటు ఏటీఎం లావాదేవీలు చార్జీలు, ఎస్ఎంఎస్ చార్జీలు కూడా ఉంటాయి. ఇలా వసూలు చేసిన డబ్బు గురించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ రాజ్యసభలో ఓ లిఖతపూర్వక ప్రకటన చేసింది. 
 
ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐదు ప్రధాన ప్రైవేటు బ్యాంకుల తమ కస్టమర్ల నుంచి ఇప్పటివరకు వసూలు చేసిన సొమ్ము ఏకంగా రూ.35 వేల కోట్లు పైమాటగానే ఉందని తెలిపబింది. అది కూడా 2018 నుంచి వసూలు చేసిన మొత్తమేనని చెప్పింది. ఇందులో రూ.21 వేల కోట్లు, కేవలం కనీస బ్యాలెన్స్ లేదన్న కారణంతోనే విధించినట్టు తెలిపింది. 
 
ప్రభుత్వ బ్యాంకులతో ప్రైవేటు సంస్థలైన యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకులు కనీస బ్యాలెన్స్ కారణంతో రూ.21 వేల కోట్లను వసూలు చేశాయని తెలిపింది. ఏటీఎం లావాదేవీల కోసం రూ.8 వేల కోట్లు, ఎస్ఎంఎస్ సేవలు అందిస్తున్నందుకు రూ.6 వేల కోట్లను వసూలు చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది.