గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (09:06 IST)

రైల్వేలు భారతీయ ఆస్తి.. ప్రైవేటీకరణ చేయం.. పియూష్ గోయల్

ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సెక్టార్లను ప్రైవేటీకరణ చేస్తూ వస్తోంది. అలాగే, భారతీయ రైల్వేను కూడా ప్రైవేటు చేయొచ్చంటూ బలమైన ఊహాగానాలు వస్తున్నాయి. వీటిపై కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించాలనే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. భారతీయ రైల్వేలు ప్రభుత్వ ఆస్తి అని, అలాగే కొనసాగుతాయన్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. 
 
'భారతీయ రైల్వేలు జాతి సంపద, ప్రజల సంపద. వీటిని ఎవరూ తాకలేరు. రైల్వేల ప్రైవేటీకరణ ఎన్నటికీ జరగదు. ప్రతిపక్షాల ప్రచార వలలో చిక్కుకోవ ద్దు. ఇది మీ ఆస్తి. అలాగే కొనసాగుతుంది' అని పీయూష్ గోయల్ ఖరగ్‌పూర్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. అయితే, దేశవ్యాప్తంగా రైల్వే సేవలను మెరుగుపరిచేందుకు ప్రైవేటు పెట్టుబడులను స్వాగతించాలని చెప్పారు. 
 
ఇదిలావుండగా, గత ఏడాది ఇండియన్ రైల్వేస్‌లో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో కొన్ని స్టేషన్ల నిర్వహణకు అనుమతించారు. ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నేతృత్వంలో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దశాబ్దాలనాటి పద్ధతుల్లో మార్పులు తేవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
దీంతో భారతీయ రైల్వేలను ప్రభుత్వం ప్రైవేటీకరించబోతోందనే ఆరోపణలు వచ్చాయి. 150 రైళ్ళు, 50 రైల్వే స్టేషన్ల కార్యకలాపాల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు బదిలీ చేయడానికి బ్లూప్రింట్‌ను తయారు చేయడం కోసం ఓ కమిటీని నియమించాలని గత ఏడాది అక్టోబరులో ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రైల్వేలను ప్రైవేటీకరించబోతున్నారనే ఊహాగానాలకు బలం చేకూరింది.