కరెన్సీ నోట్లపై ఆ ఇద్దరి మహనీయులు బొమ్మలు - పరిశీలిస్తున్న ఆర్బీఐ?
ప్రస్తుతం దేశంలో చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లపై కేవలం జాతిపిత మహాత్మా గాంధీ బొమ్మ మాత్రమే ఉంది. ఇపుడు మరో ఇద్దరు మహనీయుల ఫోటోలను కరెన్సీ నోట్లపై ముద్రించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు భారతీయ రిజర్వు బ్యాంకు పరిశీలిస్తుంది. ఆ ఇద్దరు మహనీయులు ఎవరో కాదు.. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకరు కాగా, మరొకరు భారత అణుశాస్త్ర పితామహుడు, మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ఏపీజే అద్దుల్ కలాం. వీరిద్దరి బొమ్మలను కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఆర్థిక శాఖతో పాటు ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇన్‌స్ట్రుమెంటేషన్ రంగానికి చెందిన నిపుణుడు, ఐఐటీ ఢిల్లీ మాజీ ప్రొఫెసర్ దిలీప్ సహానికి గాంధీ కొత్త ఫోటోలతో పాటు ఠాగూర్, కలాం ఫోటోలను పంపించారు. వీటిని పరిశీలించి సెక్యూరిటీ, ఇతర అంశాలపై ఆయన కేంద్రానికి ఓ నివేదిక రూపంలో సిఫార్సు చేస్తారు. ఆ తర్వాత వీరి బొమ్మలతో కొత్త నోట్ల ముద్రణ ప్రారంభమవుంది.
కాగా, గత 2017లో రిజర్వు బ్యాంకు నియమిత అంతర్గత కమిటీ ఒకటి కరెన్సీ నోట్లపై సెక్యూరిటీ ఫీచర్లను పెంచాలని, అలాగే, ప్రస్తుతం కరెన్సీ నోటుపై ఉన్న గాంధీ బొమ్మ ఫోటోను అలాగే ఉంచి ఠాగూర్, కలాం ఫోటోలను కూడా ముద్రించాలని రెండేళ్ల క్రితం సిఫార్సు చేసింది. ఇపుడు అది కార్యరూపం దాల్చనుంది. కొత్త కరెన్సీ నోట్ల ముద్రణకు అవసరమైన డిజైన్లను తయారు చేయాలని మైసూరు హోసంగాబాద్‌లోని కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌లను రిజర్వు బ్యాంకు ఆదేశించినట్టు ఆర్థిక శాఖ వర్గాల సమాచారం.