గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 మార్చి 2020 (08:19 IST)

ఎస్.బి.ఐ ఖాతాదారులకు శుభవార్త... ఏంటది?

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. సేవింగ్స్ ఖాతాల్లో ఇప్పటివరకు కనీస నిల్వగా కొంతమొత్తాన్ని ఉంచాలన్న నిబంధన ఉండేది. ఈ నిబంధనను ఇపుడు తొలగించింది. 
 
కనీస బ్యాలెన్స్ ఉంచకపోతే ఇప్పటివరకు వేస్తున్న చార్జీలను పూర్తిగా తొలగించింది. ఇదే సమయంలో సేవింగ్స్ ఖాతాలపై ఇచ్చే వడ్డీ రేట్లు, రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లను సవరించింది. 
 
ఈ మేరకు బుధవారం పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా సుమారు 44.51 కోట్ల స్టేట్ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. వారందరికీ ఈ నిర్ణయాలు ప్రయోజనం కలిగించనున్నాయి.
 
నోట్ల రద్దు తర్వాత కనీస బ్యాలెన్స్ నిబంధన
నోట్లు రద్దు తర్వాతి పరిణామాల నేపథ్యంలో స్టేట్ బ్యాంకు కనీస బ్యాలెన్స్ నిబంధనలను అమలు చేసింది. 2018 ఏప్రిల్ నుంచి ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ను తప్పనిసరి చేసింది. మెట్రో ప్రాంతాల్లో నెలవారీ కనీస బ్యాలెన్స్ సగటున రూ.3 వేలు ఉండాలని, అర్బన్ ప్రాంతాల్లో రూ.2 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.వెయ్యి ఉండాలన్న నిబంధన విధించింది. 
 
అప్పటి నుంచి కనీస బ్యాలెన్స్ ఉంచని ఖాతాల నుంచి భారీగా పెనాల్టీ చార్జీలను వసూలు చేసింది. తాజాగా ఈ కనీస బ్యాలెన్స్ చార్జీలను తొలగించింది. ఇప్పుడు ఖాతాల్లో తప్పనిసరిగా ఎలాంటి బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. 
 
వడ్డీ రేట్లలో మార్పులు
అలాగే, ఈ  బ్యాంకులో ఖాతాదారులు చేసిన డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లను కూడా సవరించింది. మార్చి పదో తేదీ నుంచే ఈ వడ్డీ రేట్లు అమల్లోకి తెచ్చినట్టు బుధవారం ప్రకటించింది. సాధారణ సేవింగ్స్ ఖాతాల్లో ఉంచే సొమ్ముకు వార్షికంగా మూడు శాతం వడ్డీని అందించనున్నట్టు తెలిపింది. అదే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై నిర్ధారిత కాలానికి అనుగుణంగా వడ్డీ రేట్లు ఉన్నాయి. ఇక రుణాలకు సంబంధించి కూడా పది బేసిస్​ పాయింట్ల మేర వడ్డీలను తగ్గిస్తున్నట్టు స్టేట్​ బ్యాంక్ ప్రకటించింది.
 
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి... 
ఏడు రోజుల నుంచి 45 రోజుల మధ్య: 4 శాతం
46 రోజుల నుంచి 179 రోజుల మధ్య: 5 శాతం
180 రోజుల నుంచి ఏడాది మధ్య: 5.5 శాతం
ఏడాది నుంచి పదేళ్ల వరకు: 5.9 శాతం
సీనియర్ సిటిజన్లకు ఆయా టైం ఫిక్స్ డ్‌డిపాజిట్లపై అర శాతం అదనంగా అందజేస్తారు.