టిక్‌టాక్‌కు మరో షాక్.. హాంకాంగ్ మార్కెట్ నుంచి అవుట్
టిక్‌టాక్ ఇప్పటికే భారీ నష్టాలను చవిచూసింది. భారత మార్కెట్లో టిక్ టాక్ నిషేధానికి గురికావడంతో ఆ సంస్థకు భారీ నష్టం తప్పలేదు. తాజాగా హాంకాంగ్ మార్కెట్ నుంచి టిక్‌టాక్ తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
ఇందుకు కారణం హాంకాంగ్ స్వయంప్రతిపత్తిని కాలరాస్తూ చైనా పార్లమెంటు ఇటీవలే జాతీయ భద్రతా చట్టానికి ఆమోదం తెలపడమే. దీంతో అక్కడ నిరసనలు భగ్గుమన్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు చైనా తీరును ఎండగడుతూ ఒకే తాటిపైకి వస్తున్నారు.
దీనిపై కన్నెర్ర జేసిన ప్రభుత్వం హాంకాంగ్‌లో నిరసనలను అణిచివేసేంచుకు టిక్‌టాక్ వినియోగాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. ఇందుకోసం టిక్‌టాక్ నిర్వాహకులతోనూ అక్కడి ప్రభుత్వ అధికారులు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో టిక్‌టాక్ తన కార్యకలాపాలను హాంకాంగ్‌లో నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అయితే ప్రభుత్వ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. కేవలం అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయానికొచ్చినట్లు వివరించింది. ఈ చర్యతో 1,50,000 మంది యూజర్లను టిక్‌టాక్ కోల్పోనుంది.