12 ఏళ్లు దాటిన చిన్నారులకు కోవిడ్-19 వ్యాక్సిన్..
దేశంలో మరో కోవిడ్-19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అందుబాటులోకి రానుంది. జైడస్ క్యాడిలా ఫార్మా అభివృద్ధి చేసిన 'జైకోవ్-డి' టీకాకు డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో అత్యవసర వినియోగానికి ఆరో వ్యాక్సిన్‌కు ఆమోదం లభించినట్లైంది. మిగతా వ్యాక్సిన్‌లకు భిన్నంగా మూడు డోసుల ఈ టీకాను 12 ఏళ్లు దాటిన చిన్నారులకు ఇవ్వనున్నారు.
ఈ వయసు వారికి దేశంలో అందుబాటులోకి వచ్చిన తొలి కొవిడ్ టీకా ఇదే కావడం విశేషం. త్వరలో దేశంలో అందుబాటులోకి రానున్న జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ ఒక అప్లికేటర్ ద్వారా ప్రజలకు అందించబడుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వికె పాల్ వెల్లడించారు. ఈ అప్లికేటర్ భారతదేశంలో మొదటిసారి ఉపయోగిస్తున్నారు. జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ సిరంజి, సూదిని ఉపయోగించకుండా ఇవ్వబడుతుందని వీకే పాల్ చెప్పారు.
వ్యాక్సిన్ లభ్యతపై, నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద జైడస్ క్యాడిలా వ్యాక్సిన్‌ను అతి త్వరలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ వ్యాక్సిన్ 12 నుండి 18 సంవత్సరాల వయస్సు గల కౌమారదశలో వారికి ఉపయోగించడానికి వీలవుతుంది.
'జైకోవ్-డి' ప్రపంచంలోనే డీఎన్‌ఏ ఆధారంగా రూపొందిన మొట్టమెదటి కోవిడ్ వ్యాక్సిన్ అని బయోటెక్నాలజీ విభాగం ప్రకటించింది. 'మిషన్ కొవిడ్ సురక్ష' కింద డీబీటీ భాగస్వామ్యంతో ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. భారత్‌లో ఇప్పటికే కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వీ, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లను వినియోగిస్తున్నారు.