ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 మే 2020 (18:03 IST)

కరోనా వ్యాక్సిన్‌ తయారీలో ముందడుగు... డబ్ల్యూహెచ్ఓకు ట్రంప్ హెచ్చరిక

ప్రపంచాన్ని వణికిస్తు్న్న వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడు కనిపెట్టే పనిలో ప్రపంచ దేశాలన్ని తలమునకలైవున్నాయి. అయితే, అమెరికా శాస్త్రవేత్తలు జరుపుతున్న పరిశోధనల్లో కాస్త ప్రగతి సాధించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం చేస్తున్న ప్రయోగాల్లో ఆశాజనకమైన ఫలితాలు ఇస్తున్నట్టు అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ ఆవిష్కరించిన వ్యాక్సిన్ ఆశాజనక ఫలితాలను ఇస్తోంది. 
 
వైరస్‌కు వ్యతిరేకంగా శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను ప్రోత్సహించడంలో ఈ వ్యాక్సిన్ పనితీరు సంతృప్తికరంగా ఉందని పరిశోధకులు అంటున్నారు. ఇప్పటికే మానవులపై తొలి దశ ప్రయోగాలు మొదలయ్యాయి. మార్చిలో 8 మంది ఆరోగ్యవంతులపై ఒక్కొక్కరికి రెండు డోసుల చొప్పున ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించి చూడగా, వారిలో యాంటీబాడీలు ఉత్పన్నమవడాన్ని గుర్తించారు. 
 
అంతేకాదు, ఆ యాంటీబాడీలు కరోనా వైరస్ కణాల ప్రత్యుత్పత్తిని కూడా అడ్డుకుంటున్నాయని పరిశోధనలో ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైంది. ఓ వ్యాక్సిన్‌లో ఇదే కీలక అంశమని, రెండో దశలో 600 మందిపై త్వరలోనే ప్రయోగాలు ఉంటాయని మోడెర్నా సంస్థ పేర్కొంది. జూలైలో నిర్వహించబోయే మూడో దశలో వేలాదిమంది ఆరోగ్యవంతులపై ప్రయోగించి చూస్తామని వెల్లడించింది. 
 
మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. కరోనాపై ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంలో విఫలమైందని, చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు ఇప్పటికే అమెరికా నిధులు నిలిపివేసిన విషయం తెల్సిందే. 
 
ఇప్పుడు మరో హెచ్చరిక చేసింది. తాజాగా డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయెసుస్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ కీలక లేఖ రాశారు. వచ్చే 30 రోజుల్లో గణనీయమైన చర్యలు తీసుకోవాలని, లేదంటే నిధులను శాశ్వతంగా నిలిపేస్తామని హెచ్చరించారు. అంతేకాదు, సంస్థ సభ్యత్వాన్ని కూడా తమ దేశం వదులుకుంటుందని తెలిపారు.
 
ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేవిధంగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటనలు చేసిందని ట్రంప్ గుర్తు చేశారు. మనిషినుంచి మనిషికి కరోనా సోకదని చైనా పరిశోధనలో వెల్లడైనట్లు గతంలో డబ్ల్యూహెచ్‌వో ప్రకటిందని, అయితే, ఆ తర్వాత ప్రకటించిన నివేదిక మరోలా ఉందని ఆయన పేర్కొన్నారు.
 
కరోనా గురించి మాట్లాడిన వైద్యులపై దాడులు జరుగుతున్నప్పటికీ చైనా పారదర్శకంగానే వ్యవహరిస్తోందంటూ డబ్ల్యూహెచ్‌వో వ్యాఖ్యలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అంతకు ముందు శ్వేతసౌధంలో మాట్లాడిన ట్రంప్.. డబ్ల్యూహెచ్‌వో చైనాకు తోలుబొమ్మ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.