శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 మే 2020 (10:50 IST)

ఆంధ్రప్రదేశ్ - తెలంగాణాల్లో రెడ్ - ఆరెంజ్ - గ్రీన్ జోన్లు ఏవి?

కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు బెంబేలెత్తిపోయారు. ప్రభుత్వాలకు కూడా ఆరంభంలో ఏం చేయాలో తోచలేదు. కానీ, కరోనా వైరస్ కట్టడి కోసం అమలు చేసిన సంపూర్ణ లాక్‌డౌన్ అద్భుతంగా పని చేసింది. ఫలితంగా ఇతర ప్రపంచ దేశాలతో పోల్చితే మన దేశం ఎంతో సురక్షితంగా ఉంది. అయినప్పటికీ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టు సడలించడం లేదు. కరోనా వైరస్ చివరి లింకును తెంచేవరకు నిద్రపోరాదని భీష్మ ప్రతిజ్ఞ చేశాయి. ఫలితంగా అనేక రకాల చర్యలు చేపడుతున్నాయి. ఇందులోభాగంగా, కరోనా ప్రభావిత రాష్ట్రాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ అనే మూడు జోన్లుగా విభజించాయి. ఈ జోన్లలో చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ ఆయా రాష్ట్రాలకు లేఖ రాశారు. 
 
ఇపుడు రెడ్, ఆరెంజ్ జోన్లలో ఉన్న జిల్లాల్లో కేంద్రం కొన్ని మార్పులు చేసింది. దేశ వ్యాప్తంగా రెడ్‌జోన్‌లో 130 జిల్లాలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆరెంజ్‌ జోన్‌లో 284, గ్రీన్‌జోన్‌లో 319 జిల్లాలు ఉన్నట్లు తెలిపింది. రెడ్‌జోన్‌లో అత్యధికంగా యూపీలోని 19 జిల్లాలు, మహారాష్ట్రలోని 14 జిల్లాలు, తమిళనాడులో 12, ఢిల్లీ 11, బెంగాల్‌లో 10 జిల్లాలను కేంద్రం చేర్చింది. రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు జోన్లలో మార్పులు చేశామని ప్రీతి సూడాన్ స్పష్టం చేశారు. 
 
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా రెడ్, ఆరెంజ్ జోన్లలో ఉన్న జిల్లాల్లో కేంద్రం కొన్ని మార్పులు చేయడం గమనార్హం. కేంద్రం చేసిన తాజా మార్పులతో ఏపీలోని 13 జిల్లాల్లో 5 జిల్లాలు రెడ్ జోన్ పరిధిలోకి వచ్చాయి. 7 జిల్లాలు ఆరెంజ్‌ జోన్‌లో చేర్చారు. తెలంగాణలో రెడ్‌జోన్‌లో 6 జిల్లాలు, ఆరెంజ్‌ జోన్‌లో 18 జిల్లాలు, గ్రీన్‌జోన్‌లో 9 జిల్లాలను చేర్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
 
ఆ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ జోనులో ఉన్న జిల్లాలను పరిశీలిస్తే, కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు ఉన్నాయి.
అలాగే, ఆరెంజ్‌ జోనులో తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖ జిల్లాలు, గ్రీన్ జోనులో విజయనగరం జిల్లా మాత్రమే ఉంది. 
 
ఇకపోతే, తెలంగాణ రాష్ట్రంలోని రెడ్ జోన్ జిల్లాలను పరిశీలిస్తే హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాలు ఉండగా, ఆరెంజ్ జోనులో నిజామాబాద్, జోగులాంబ గద్వాల, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, కుమ్రం భీం అసిఫాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, జనగాం, నారాయణపేట, మంచిర్యాల, గ్రీన్ జోనులో పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉన్నాయి.