శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (17:49 IST)

తిరుపతిలో వెయ్యి మంది కరోనా పేషంట్లు మాయం?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా ప్రబలుతున్న పట్టణాల్లో తిరుపతి ఒకటి. కానీ, ఈ పట్టణంలో కరోనా వైరస్ బారినపడే రోగులకు తిరుపతి వైద్యాధికారులు ముచ్చెమటలు పోయిస్తున్నారు. 
 
గత రెండు నెలల కాలంలో తిరుపతిలో 9,164 మంది కరోనా బారిన పడగా... ప్రస్తుతం 7,270 మంది ఆచూకీ మాత్రమే లభించింది. మిగిలిన 1,049 మంది రోగులు ఎక్కడున్నారనే విషయం తెలియడం లేదు. 
 
వారు ఇచ్చిన ఇంటి నెంబర్లలో కూడా వారు లేరు. వారి ఫోన్ నంబర్లు కూడా పని చేయడం లేదు. దీంతో వారి కోసం అధికారులు వేట ప్రారంభించారు. మరో 845 మంది పాజిటివ్ రోగులు తిరుపతిని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని అధికారులు గుర్తించారు.
 
కరోనా శాంపిల్స్ ఇచ్చే సమయంలో బాధితులు తప్పుడు చిరునామాలు, ఫోన్ నంబర్లు ఇస్తున్నారు. ఆ తర్వాత టెస్టు రిపోర్టులు రాకముందే వారు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నట్టు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా వ్యక్తులు ఇతరులకు కూడా కరోనాను అంటిస్తున్నారని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.