శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి కరోనా.. చిత్తూరులో ఒకే రోజు 25 కేసులు
కరోనా లింకులు శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి వస్తున్నాయి. తిరుపతిలో సుమారు 200 అపార్టుమెంట్లు ఉండే చోట నివాసం ఉన్న అధికారిని క్వారంటైన్‌కు తరలించారు. శ్రీకాళహస్తిలో పని చేసే ఎక్కువ మంది తిరుపతిలోనే ఉంటున్నారు. దీంతో తిరుపతి వాసులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శ్రీకాళహస్తిలో మరో ఏడుగురికి ఈ రోజు కరోనా పాజిటీవ్ వచ్చింది. వీరిలో ఆరుగురు పోలీసులు ఉన్నారు.
మరొకరు చెన్నై నుంచి వచ్చిన యువకుడు. శ్రీకాళహస్తి టూ టౌన్ మహిళా ఎస్ఐకి కరోనా అని నిర్ధారణ అయింది. దీంతో శ్రీకాళహస్తిలో మొత్తం ఏడుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు పోలీసులతో కలిసి పనిచేసిన వివిధ విభాగాల సిబ్బందిని, వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.
ఇకపోతే చిత్తూరు జిల్లాలో మంగళవారం 25 కరోనా కేసులు నమోదైతే... ఒక్క శ్రీకాళహస్తిలోనే 24 కేసులు రికార్డయ్యాయి. ఒకేరోజు భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు రావడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. బాధితులతో కాంటాక్ట్ ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నారు. కొత్త కేసుల్లో 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. పోలీసులు, రెవెన్యూ శాఖ ఉద్యోగులు ఉన్నారు. వీరు ఎవరూ రోడ్‌జోన్లకు వెళ్లకపోయినా... క్యారియర్ ద్వారా వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వీరికి ముందుగా ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. ఇక మరో ఇద్దరు మెడికల్ షాపుల యజమానులు కాగా, మరో వ్యక్తికి కరోనా సోకింది. కరోనా బాధితుల కుటుంబాలను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.