శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 మే 2021 (20:07 IST)

కేసులు తగ్గినా.. ప్రభావం మాత్రం జూలై వరకు...

దేశంలో కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతుంది. అయినప్పటికీ ఈ ప్రభావం మాత్రం జూలై మొదటివారం వరకు ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
గత కొన్ని రోజులుగా తీవ్ర ప్రభావం చూపిన కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కొంత బలహీనంగా కనిపిస్తోంది. దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో కొత్త కేసులు తగ్గుతున్నాయని కేంద్ర‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
వీటిలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ త‌దిత‌ర క‌రోనాకు అత్య‌ధికంగా ప్ర‌భావిత‌మైన‌ రాష్ట్రాలు కూడా ఉండ‌టం విశేషం. ఈ సంద‌ర్భంగా అంటు వ్యాధుల నిపుణులు డాక్ట‌ర్‌ షాహిద్ జమీల్ మాట్లాడుతూ ప్ర‌స్తుతం క‌రోనా కేసులు తగ్గుతున్నట్లు క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ, సెకెండ్ వేవ్ ముగియడానికి మరికొన్ని నెలలు పడుతుంద‌న్నారు. 
 
అంటే రెండో దశ వ్యాప్తి ప్రభావం జూలై చివరి వ‌ర‌కూ ఉండ‌వ‌చ్చ‌న్నారు. దేశంలో సెకెండ్ వేవ్ వ్యాప్తి చెందడానికి కొత్త వేరియంట్లు కూడా కారణమవుతాయని, అయితే అవి మరింత దుర్భ‌రంగా ఉంటాయ‌ని చెప్పే సూచ‌న‌లేవీ లేవ‌ని ఆయన అన్నారు. ఫ‌స్ట్‌ వేవ్‌లో దేశంలో రోగుల సంఖ్య ఒక‌ రోజులో 96-97 వేల వ‌ర‌కూ ఉండేదన్నారు. 
 
కానీ రెండో దశ నాటికి సుమారు 4 లక్షలకు చేరింద‌ని అని షాహిద్ జమీల్ అన్నారు అందుకే సెకెండ్ వేవ్‌ను అదుపు చేసేందుకు మ‌రింత సమయం పడుతుంద‌న్నారు. దేశంలో క‌రోనా సెకెండ్ వేవ్‌కు కోవిడ్ ప్రోటోకాల్ పాటించకపోవడమే ముఖ్య కారణమన్నారు. అలాగే ఎన్నికల ర్యాలీలు, ఇత‌ర మతపరమైన ఉత్స‌వాలు కూడా క‌రోనా వ్యాప్తికి కార‌ణ‌మ‌న్నారు.