సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (12:32 IST)

దేశంలో 169కి చేరిన కరోనా కేసులు... దేశ వ్యాప్తంగా రైళ్ల రద్దు

కరోనా వైరస్ ‌(కోవిద్‌-19) ప్రభావం రైల్వేశాఖ మీద కూడా పడింది. దేశంలో నిత్యం లక్షలాది మంది రైళ్లలో పయణిస్తారన్న విషయం తెలిసిందే. దీంతో, వైరస్‌ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యగా రైల్వేశాఖ అధికారులు 168 రైళ్లను రద్దు చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా మార్చి 20 నుంచి 31 వరకు రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. 
 
ముందస్తుగా టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు వ్యక్తిగతంగా సమాచారం అందిస్తామని రైల్వేశాఖ ప్రకటించింది. మరోవైపు భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 169కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. దేశంలో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 
 
ఒకే రోజులో 475 మృతులు 
ఇటలీలో కరోనా వైరస్‌(కోవిద్‌-19) విజృంభిస్తోంది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 2,978 మంది ఇటాలియన్‌లు మృత్యువాత పడ్డారు. గురువారం ఒక్కరోజే ఇటలీలో కరోనా వైరస్‌ కారణంగా 475 మంది మరణించారు. 
 
కాగా, అమెరికాలో 153 మంది, ఫ్రాన్స్‌లో 264 మంది, యూకేలో 104 మంది, దక్షిణకొరియాలో 91 మంది, నెదర్లాండ్స్‌లో 58 మంది, జపాన్‌లో 29 మంది అత్యధికంగా కరోనాతో మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2లక్షల 18 వేల 997 కరోనా పాజిటవ్‌ కేసులు నమోదయ్యాయి.