రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు.. లండన్ నుంచి అలా ఒంగోలుకు..
రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య రెండుకు చేరింది. ఈనెల 12న లండన్ నుంచి బయలుదేరిన ఆయన 15న ఒంగోలు చేరుకున్నారు.
జలుబు, దగ్గు, జ్వరం ఉండటంతో కరోనా అనుమానంతో ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలో చేశారు. వెంటనే శాంపిల్స్ తీసుకున్న వైద్యులు తిరుపతిలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. బుధవారం రాత్రి వచ్చిన రిపోర్టుల్లో ఆయనకు పాజిటివ్ వచ్చింది.
బాధితుడి వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. రాష్ట్రంలో మరో పాజిటివ్ కేసు నమోదవడంతో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు ఒంగోలు ప్రభుత్వాస్పత్రి వైద్యులను అలెర్ట్ చేశారు.
ఇప్పటికే నెల్లూరులో ఒక పాజిటివ్ కేసు నమోదవగా బాధితుడికి అక్కడి ప్రభుత్వాస్పత్రిలోని ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు బుధవారం మరో ముగ్గురు అనుమానితులు ఆస్పత్రుల్లో చేరారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 105 మంది శాంపిల్స్ పరిశీలించగా 96 నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి. రెండు పాజిటివ్ రాగా, మరో ఏడుగురి రిపోర్టు రావాల్సి ఉంది. శుక్రవారం సాయంత్రానికి మిగిలిన కేసులకు సంబంధించిన రిపోర్టులు రానున్నాయి.