మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 జనవరి 2021 (10:49 IST)

దక్షిణాదిలో భిన్నమైన కరోనా వైరస్ .. సీసీఎంబీ :: సౌతాఫ్రికాలో స్ట్రెయిన్

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు తల్లడిల్లిపోయారు. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలోనూ ఇదే పరిస్థితి. ఇప్పటికే కోటి మందికి పైగా ఈ వైరస్ బారినపడ్డారు. అయితే, భారత్‌లో ఉన్న వైరస్.. ఉత్తరాది రాష్ట్రాలకు, దక్షిణాది రాష్ట్రాల్లో భిన్నంగా ఉన్నట్టు హైదరాబాద్‌లని సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్రకటన ఇపుడు సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. 
 
ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం ఉన్న వైరస్‌కు భిన్నమైన కరోనా వైరస్‌గా సీసీఎంబీ గుర్తించింది. అయితే, ఇతర రకాల కంటే ఇది కొంత బలహీనంగా ఉందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా చెప్పడం కొంత ఊరటనిచ్చే అంశం. ఈ భిన్నమైన కరోనా రకానికి 'ఎన్440కె' అని పేరు పెట్టారు.
 
దేశంలో ఈ రకం వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు పరిశోధనలు ప్రారంభిస్తామన్నారు. ఏపీ, తెలంగాణలలో వెలుగుచూసిన కరోనా వైరస్ పూర్తిగా కొత్త రకం కాదని, భిన్నమైన రకమేనని రాకేశ్ వివరించారు. దీని వ్యాప్తి పరిమితంగానే ఉందని, గతేడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కొన్ని కేసుల్లో ఇది కనిపించిందని తెలిపారు.
 
ఇప్పుడు మాత్రం ఇది విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని అన్నారు. పాత వైరస్ బలహీనపడడం ద్వారా ఇది పుట్టుకొచ్చి ఉండొచ్చన్నారు. ఇది సోకినవారిలో లక్షణాలు చాలా స్వల్ప స్థాయిలో ఉన్నట్టు తెలిపారు. ఈ వైరస్ రకంపై పెద్దగా డేటా లేకపోవడంతో మరిన్ని పరిశోధనలు అవసరమని రాకేశ్ మిశ్రా పేర్కొన్నారు.
 
మరోవైపు, సాధారణ కరోనా వైరస్, యూకేలో వెలుగులోకి వచ్చిన కొత్త కరోనాతో పోలిస్తే, మరింత వేగంగా వ్యాపిస్తున్న దక్షిణాఫ్రికా కరోనా స్ట్రెయిన్ అమెరికాకు వ్యాపించింది. ఎక్కడికీ ప్రయాణాలు చేయని ఇద్దరిలో ఈ కొత్త వైరస్ బయట పడిందని గురువారం నాడు వైద్యాధికారులు వెల్లడించారు. 
 
ఈ రెండు కేసులూ సౌత్ కరోలినాలోనే వెలుగులోకి రావడం గమనార్హం. సార్స్ - కోవ్-2 పేరిట ఉన్న ఈ వైరస్ పౌరులందరికీ ఓ హెచ్చరిక వంటిదని, దీన్ని తక్షణం అరికట్టేందుకు చర్యలు తీసుకోకుంటే, తక్కువ సమయంలోనే పెను ఇబ్బందులు తప్పవని సౌత్ రోలినా రాష్ట్ర ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ బ్రాన్న్ ట్రాక్స్ లర్ హెచ్చరించారు.