టీకాల పంపిణీ .. 11న సీఎంలతో మోడీ భేటీ : పీఎం కేర్స్ నిధులతో కొనుగోలు!

covid 19 vaccine
ఠాగూర్|
ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్, ఇండియాలో సంక్రాంతి పర్వదినాల తర్వాత అంటే ఈ నెల 16వ తేదీన ప్రారంభం కానుంది. ఇందుకోసం కేంద్ర‌ ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్ల‌ను పూర్తి చేస్తోంది. ఈ నెల 16 నుంచి వ్యాక్సినేష‌న్‌ను మొద‌లు పెట్టాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడ‌నున్నారు.

ఆయా రాష్ట్రాలు వ్యాక్సినేష‌న్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన ఏర్పాట్ల‌పై ఆయ‌న చ‌ర్చించ‌నున్నారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన వ్యాక్సిన్ డ్రైరన్‌పై కూడా మోడీ వివ‌రాలు తెలుసుకోనున్నారు. దేశంలో క‌రోనా ప‌రిస్థితుల‌పై నిన్న కూడా మోడీ అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొని అన్ని వివ‌రాలు తెలుసుకున్నారు.

మరోవైపు, పలు దేశాల్లో కరోనా కొత్త కేసులు రోజురోజుకూ పెరుగుతున్న వేళ, ఆయా దేశాలతో పోలిస్తే, ఇండియాలో కేసుల సంఖ్య దాదాపు కనిష్ఠానికి చేరగా, వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఇక, తొలి 10 కోట్ల డోస్‌లను కొనుగోలు చేసేందుకు పీఎం కేర్స్ నుంచి నిధులను కేటాయించాలని మోడీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించింది.

తొలిదశ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా 30 కోట్ల మందికి టీకాను అందించాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది. అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతున్నాయని, ప్రతి రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన వారికి తొలి దశ టీకాలు ఇవ్వనున్నామని, అందుకు తగ్గట్టుగా టీకా డోస్‌లను సిద్ధం చేస్తున్నామని, ఇందుకోసం నాలుగు మేజర్ డిపోలు సిద్ధం చేశామని అధికారులు వెల్లడించారు.

తొలి డోస్‌లన్నీ ఆక్స్ ఫర్డ్ - ఆస్ట్రాజెనికా తయారు చేసిన కొవిషీల్డ్ టీకాలు ఉంటాయని, వాటిని సీరమ్ ఇనిస్టిట్యూట్ అందించనుందని స్పష్టం చేశారు. ఆ తర్వాతి దశలో భారత్ బయోటెక్ తయారు చేస్తున్న వ్యాక్సిన్‌ను కూడా కొనుగోలు చేస్తామని వెల్లడించిన ఆయన, రెండో డ్రైరన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 550 జిల్లాల్లో కో-విన్ సిస్టమ్‌ను పరిశీలించామని తెలిపారు.

కాగా, ఇప్పటివరకూ సుమారు 3 కోట్ల మంది హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లను గుర్తించగా, ఆ తర్వాత 50 ఏళ్లు దాటిన వృద్ధులకు వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మిగిలిన ప్రజలందరికీ ఈ టీకాలను వేయనున్నారు.దీనిపై మరింత చదవండి :