శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 18 మే 2021 (15:22 IST)

ఇద్దరూ ఒకేసారి పుట్టారు, హైదరాబాదులో సాఫ్ట్వేర్ జాబ్స్, కరోనా కాటుతో ఇద్దరూ...

కరోనావైరస్ ఎంతోమంది గుండెలను బద్ధలు చేస్తోంది. కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగులుస్తోంది. వారం రోజుల వరకూ తమ కంటి ముందే సంతోషంతో తిరిగే వారిని మృత్యు రూపంలో కబళిస్తోంది. కరోనా విజృంభణకు లక్షల మంది దుఃఖసాగరంలో మునిగిపోతున్నారు.
 
హైదరాబాదులో సాప్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఇద్దరు ఇంజనీరింగ్ సోదరులు జోఫ్రెడ్ వర్గీస్ గ్రెగొరీ మరియు రాల్ఫ్రెడ్ జార్జ్ గ్రెగొరీ మీరట్‌‌కు చెందినవారు. వీరివురూ 5 నిమిషాల తేడాతో కవలలుగా జన్మించారు. ఈ కవలల్ని పెంచి పెద్దచేశారు ఉపాధ్యాయ తల్లిదండ్రులు. అలా ఇద్దరూ ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్‌కు చెందిన ఒక సంస్థలో చేరారు.
కంపెనీలో మంచి పేరు రావడంతో జర్మనీ, లండన్ వెళ్లాలని ఇద్దరూ తమ తల్లిదండ్రుల వద్ద చెపుతుండేవారు. ఐతే ఈ కవల సోదరులిద్దరూ కోవిడ్ 19 సోకి ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరూ కలిసే పుట్టారు, ఐతే కలిసే చనిపోతారని అనుకోలేదంటూ ఆ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. 22 గంటల తేడాతో ఇద్దరు కొడుకులు కరోనా కాటుకు బలయ్యారు.
 
వారి తండ్రి గ్రెగొరీ రేమండ్ రాఫెల్ మాట్లాడుతూ... తన కుమారులిద్దరూ ఏప్రిల్ 23, 1997న జన్మించారనీ, కానీ 24 సంవత్సరాల తరువాత, ఏప్రిల్ 24 న తమ కుమారులిద్దరూ కరోనా బారిన పడ్డారన్నారు. చికిత్స పొందుతూ ఇద్దరూ కరోనాతో మే 13న ఒకరు, మే 14న మరొకరరు చనిపోయారని కన్నీళ్లు పెట్టుకున్నారు.
 
తమ 24వ పుట్టినరోజును ఏప్రిల్ 23న ఇద్దరూ ఘనంగా జరుపుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఎక్కడికెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారనీ, ఒకేసారి కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇద్దరూ హైదరాబాద్‌లో పనిచేశారన్నారు. విధి క్రూరత్వం కారణంగా తమ బిడ్డలిద్దరూ ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పి వెళ్లిపోయారని ఉద్వేగానికి లోనయ్యారు.
మీరట్ కాంట్ ప్రాంతంలో నివసిస్తున్న ఈ కవల సోదరులు ఇద్దరికీ మే 1న జ్వరం వచ్చింది. తొలుత సాధారణ జ్వరమే అనుకున్నప్పటికీ ఆ తర్వాత వారిరువురికీ కరోనా పరీక్షలు చేశారు. ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆ తర్వాత వారం రోజుల తర్వాత టెస్ట్ చేయగా నెగటివ్ వచ్చింది. ఐతే జాఫ్రెడ్ నీరసంగా కనిపించడంతో ఆసుపత్రిలో మరికొన్ని రోజులు వుంచి పర్యవేక్షించాలని తండ్రి కోరారు.
 
ఈ లోపు అతడిని సాధారణ ఐసియు వార్డుకు తరలించాలని అనుకున్నారు. కానీ తెల్లారేసరికి అతడి ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. దాంతో అతడు మే 13న కన్నుమూశాడు. ఈ విషయాన్ని వైద్యులు జాఫ్రెడ్ తల్లిదండ్రులకు తెలియజేశారు. ఇంతలో మరో కుమారుడి నుంచి తల్లిదండ్రులకు ఫోన్. అన్నకు ఎలా వుందంటూ అతడు ప్రశ్నించాడు. దుఃఖాన్ని దిగమింగుకుంటూ అన్నకు బాగానే వుంది నువ్వు జాగ్రత్త అని చెప్పారు చనిపోయిన విషయాన్ని దాచిపెడుతూ.
 
కానీ అతడు మళ్లీ ఫోన్ చేసి మీరు నాకు అబద్ధం చెప్తున్నారు. అన్నయ్య ఫోన్ స్విచాఫ్ వస్తోంది. బహుశా అతడు చనిపోయ వుంటాడు అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. అతడిని ఎలా ఓదార్చాలో ఆ తండ్రికి అంతుబట్టలేదు. కానీ తెల్లారేసరికి అన్న మరణవార్త తట్టుకోలోని తమ్ముడు గుండె కూడా ఆగిపోయింది. ఇద్దరూ కేవలం 22 గంటల వ్యవధిలో కన్నుమూశారు. తన కుమారులిద్దరి అంత్యక్రియలు చేసిన ఆ తండ్రి వారి సమాధులపై పడి కన్నీళ్లుపెట్టుకుంటుంటే స్థానికులు కూడా ఆవేదన చెందారు.