బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (10:16 IST)

రెడ్ జోన్లలో కఠిన నిబంధలు.. పక్కింటికి కూడా వెళ్లడానికి వీల్లేదు..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. అలాగే, మనదేశంలో కూడా ప్రస్తుతం లాక్‌డౌన్ అమల్లో వుంది. ఇది ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. అయినప్పటికీ మరో రెండు వారాలు పొడగించనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. 
 
ముఖ్యంగా కరోనా వైరస్ కేసులు అధిక సంఖ్యలో నమోదైన ప్రాంతాలు, వ్యాపించిన ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించి, వీటిని రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఖచ్చితంగా చెప్పాలంటే, విదేశాలకు వెళ్లి వచ్చిన వారి కారణంగా, ఏ ప్రాంతంలో అయితే, ఇతరులకు కరోనా వైరస్ సోకిందో, ఆయా ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తిస్తారన్నమాట. ఈ ప్రాంతాల్లో చాలా కఠినమైన నిబంధనలను అధికారులు అమలు చేస్తున్నారు. 
 
ఇలా రెడ్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎవరూ బయటకు రావడానికి వీల్లేదు. వీధిలోకి కాదుగదా... కనీసం పక్కింటికి వెళ్లడానికి కూడా వీల్లేదు. పాలు, కూరగాయలు, నిత్యావసరాలను అధికారులే ఇళ్ల వద్దకు చేరుస్తారు. వాటిని కూడా ఇంట్లో నుంచి ఒకరు మాత్రమే బయటకు వచ్చి తీసుకోవాల్సి వుంటుంది.
 
తమ పక్క వీధిలో ఉంటున్న వారు ఉదయం నుంచి సాయంత్రం వరకూ తమకు కావాల్సినవన్నీ తెచ్చుకుంటున్నా, రెడ్‌జోన్ పరిధిలోని వారు ఎంతో అత్యవసరమైతే, అది కూడా పోలీసుల అనుమతితోనే బయటకు రావాల్సి వుంటుంది. ఈ ప్రాంతంలోకి వచ్చేందుకు బయటివారెవరికీ అనుమతి ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రెడ్ జోన్ వీధుల్లోకి ఇతరులను అనుమతించే ప్రసక్తే లేదని అధికారులు వెల్లడించారు. 
 
ఇకపోతే, రెడ్‌జోన్ ప్రాంతానికి రెండు నుంచి మూడు కిలోమీటర్ల పరిధి వరకూ ప్రత్యేక పారిశుద్ధ్యా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ప్రత్యేక వాహనాల సాయంతో పిచికారీ చేయిస్తున్నారు. సదరు ప్రాంతానికి వెళ్లే అన్ని వైపులనూ బారికేడ్లతో దిగ్బంధించే పోలీసులు, ఆ ప్రాంతం రెడ్‌జోన్ అని సూచించే బోర్డులను పెడతారు. అక్కడ 24 గంటలూ పోలీసు కాపలా ఉంటుంది. గుర్తింపు పొందిన అధికారులు, హెల్త్ వర్కర్లు, నిత్యావసరాలు సరఫరా చేసే వారికి మాత్రమే బారికేడ్లను దాటి లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. 
 
ఇక కరోనా పాజిటివ్ కేసు నమోదైన ఇంటికి, ఆ ఇంట్లో మహమ్మారి ఉందని సూచించేలా ప్రత్యేక స్టిక్కర్లను అంటిస్తారు. ఇక ఈ ప్రాంతంలోని వారిలో ఎవరికైనా జలుబు, దగ్గు తదితర కరోనా లక్షణాలు ఉన్నాయేమోనన్న అనుమానంతో, రోజుకు రెండు సార్లు హెల్త్ వర్కర్లు పరీక్షిస్తుంటారు. ఎవరిలోనైనా లక్షణాలు కనిపిస్తే, వెంటనే వారి నమూనాలను సేకరించి, క్వారంటైన్ చేస్తారు. 
 
రెడ్ జోన్ల పరిధిలో కనీసం 14 రోజుల పాటు కఠిన ఆంక్షలుంటాయని, ఈలోగా కొత్త కేసులు రాకుండా ఉంటేనే నిబంధనలు తొలగిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొత్త కేసులు వస్తే, ఆపై మరో 14 రోజులు ఇవే ఆంక్షలుంటాయని అధికారులు వెల్లడించారు.