శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 26 ఫిబ్రవరి 2022 (11:20 IST)

తగ్గిన కరోనా కేసులు - ఆంక్షలను సడలించిన కేంద్రం

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గిపోయింది. శనివారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు... గడిచిన 24 గంటల్లో 11499 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 255 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,21,881 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 1.01 శాతంగా ఉంది. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,22,70,482కు చేరింది. మృతుల సంఖ్య 5,13,481కు పెరిగింది.
 
ఇదిలావుంటే దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో కేంద్ర ప్రభుత్వం కోవిడ్‌కు సంబంధించి మార్గదర్శకాలను సడలించింది. కరోనా ఆంక్షలకు మినహాయింపులు ఇస్తున్నట్టు కేంద్రం తెలిపింది. రాత్రిపూట కర్ఫ్యూలకు సడలించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. వినోదం, క్రీడలు, ఫంక్షలు, సోషల్ గ్యాదరింగ్స్, మతపరమైన వేడుకలు తదితరాలపై విధించిన ఆంక్షలను సడలించాలని చెప్పింది. 
 
కోవిడ్ తీవ్రత తగ్గుతున్న నేపథ్యంలో ఆంక్షలను సడలించినట్టు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా తెలిపారు. స్థానిక పరిస్థితులను బట్టి ఆంక్షలను అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆయన సూచించారు షాపింగ్ మాల్స్, థియేటర్లు, ప్రజా రవాణా వ్యవస్థ, రెస్టారెంట్లు, బార్లు, స్కూల్స్, కాలేజీలు, జిమ్‌లు కార్యాలయాలను తెరవడంపై రాష్ట్రాలు తుది నిర్ణయం తీసుకోవాలని కోరారు.