1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 జులై 2022 (10:38 IST)

దేశంలో పెరిగిపోతున్న క్రియాశీలక కరోనా పాజిటివ్ కేసులు

coronavirus
దేశంలో క్రియాశీలక కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గత రెండు రోజులుగా 20 వేలకు పైగా నమోదైన ఈ కేసులు మూడోరోజైన శనివారం కూడా అదే స్థాయిలో నమోదయ్యాయి. దీంతో క్రియాశీలక కేసులు 1.40 లక్షలకు చేరుకున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించిన వివరాల మేరకు.. 
 
గడిచిన 24 గంటల్లో మొత్తం 4,17,895 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 20,044 కేసులు వెలుగు చూశాయి. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.80 శాతానికి పెరిగింది. 
 
అలాగే, గడిచిన 24 గంటల్లో 56 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకూ మృతి చెందిన వారి సంఖ్య 5,25,660కి చేరింది. ఇకపోతే, 18,301 మంది కోలుకోగా.. ఇప్పటివరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.3 కోట్లు (98.48 శాతం) దాటింది.
 
వైరస్‌వ్యాప్తి పెరుగుతుండటం.. క్రియాశీల కేసులపై ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం దేశంలో 1,40,760(0.32 శాతం) యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో వ్యాక్సినేషన్‌ నిరంతరాయంగా కొనసాగుతూ 200 కోట్ల డోసులకు చేరువ కావడం విశేషం. ఇప్పటి వరకూ 199,71,61,438 డోసులు పంపిణీ చేశారు.
 
మరోవైపు దేశంలో తొలి మంకీపాక్స్‌ కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వ్యాధి వ్యాప్తి నివారణ నిమిత్తం కేంద్ర ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.