శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 జూన్ 2021 (10:27 IST)

దారికొస్తున్న కరోనా.. 58 రోజుల కనిష్ట స్థాయికి కొత్త కేసులు

దేశంలో కరోనా వైరస్ దారికొస్తోంది. కేంద్రం నిర్ణయంపై ఆధారపడకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కరోనా వైరస్ వ్యాప్తికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా, అనేక రాష్ట్రాలు స్వయంగా  లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. దీనివల్ల ఆర్థికంగా నష్టపోతమని తెలిసినప్పటికీ.. ప్రజలక్షేమమే ముఖ్యమని భావించి లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో దేశంలో రెండో దశ కరోనా వైరస్ వ్యాప్తి మొదలయ్యాక గత 58 రోజుల్లో తొలిసారి అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 7న 1,15,736 కేసులు నమోదు కాగా... ఆ తర్వాత దేశంలో కరోనా బీభత్సం కనిపించింది. కొన్నివారాల పాటు కొవిడ్ స్వైరవిహారం చేసింది. అయితే ఎక్కడికక్కడ లాక్డౌన్లు, కఠిన ఆంక్షలతో పరిస్థితి క్రమంగా అదుపులోకి వస్తోంది. 
 
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,20,529 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. వరుసగా 23వ రోజు రోజువారీ కేసుల కంటే రికవరీలు అధికంగా నమోదయ్యాయి. తాజాగా 1,97,894 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అదేసమయంలో 3,380 మంది మరణించారు. 
 
దేశంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,86,94,879కి చేరింది. ఇప్పటివరకు 2,67,95,549 మంది ఆరోగ్యవంతులు కాగా, ఇంకా 15,55,248 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలుపుకుని దేశంలో కరోనా మృతుల సంఖ్య 3,44,082కి పెరిగింది.