గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వరుణ్
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2023 (10:36 IST)

దేశంలో మళ్లీ పది వేలకు పైగా పాజిటివ్ కేసులు.. ఢిల్లీలోనే వైరస్ ప్రభావం అధికం..

coronavirus
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గుట్టు చప్పుడు కాకుండా పెరుగుతోంది. ఫలితంగా రోజు వారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో ఏకంగా పది వేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసుల్లో అత్యధికం ఢిల్లీలోనే నమోదు కావడం గమనార్హం. అదేసమయంలో గత మూడు రోజులుగా పది వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. 
 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10542 మంది ఈ వైరస్ బారినపడినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది. వీటితో కలుపుకుంటే ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 63 వేలు దాటిందని వెల్లడించింది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, పాజిటివిటీ రేట్ 26.54 శాతానికి చేరిందని తెలిపింది. ఢిల్లీలో సగటున రోజూ వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. 
 
ఇదిలావుంటే, గత మూడు రోజులుగా కరోనా కొత్త కేసులు పదివేల లోపే నమోదవుతున్నాయి. ఆదివారంతో గడిచిన 24 గంటల్లో 7633 మంది వైరస్ బారినపడగా, సోమవారం ఈ సంఖ్య 9111కి చేరింది. ఈ క్రమంలో కరోనా ప్రభావం తగ్గుతోందని అధికారులు తెలిపారు. అయితే, బుధవారం మరోమారు 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం ఇపుడు ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.