శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (12:50 IST)

భారత్‌లో బి.1.617 వైరస్‌.. 17 దేశాల్లో గుర్తింపు.. ఇక్కడే బయటపడింది..

భారత్‌లో ఉత్పరివర్తనం చెందిన కరోనా బి.1.617 వైరస్‌ రకం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు పాకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇప్పటివరకు కనీసం 17 దేశాల్లో ఈ వైరస్‌ రకాన్ని గుర్తించినట్లు పేర్కొంది. 
 
బి.1.617 జంట ఉత్పరివర్తనాల వైరస్ రకం. తొలిసారిగా ఇది భారత్‌లో బయటపడగా.. యూకే, సింగపూర్‌ సహా పలు దేశాల్లో ఈ రకాన్ని గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో తన వీక్లీ అప్‌డేట్‌లో తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఇది ప్రాణాంతకం అని ప్రటించలేమని పేర్కొంది.
 
అయితే ఇతర రకాలతో పోలిస్తే ఈ రకం వేగంగా వ్యాప్తి చెందుతోందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. భారత్‌లో కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో బి.1.617 రకానిదే కీలక పాత్ర అయి ఉంటుందని అంచనా వేస్తోంది.
 
అయితే దీంతో పాటు వైరస్‌ ఉద్ధృతికి ఇతర కారణాలూ ఉన్నాయని చెప్పింది. ఆరోగ్య ప్రమాణాల పట్ల ప్రజల్లో పెరిగిన నిర్లక్ష్యం.. జన సమూహాలు, నిబంధనలు పట్టించుకోకపోవడం వల్ల కేసులు అమాంతం పెరిగాయని తెలిపింది.
 
ఇదిలా ఉండగా.. భారత్‌లో వెలుగుచూసిన వైరస్‌ కొత్తరకం ప్రాణాంతకం అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. బి.1.617 రకం వల్ల ఇన్ఫెక్షన్ తీవ్రత పెరుగుతున్నట్లు ఆధారాలు లేవని నేషనల్‌ సెంటర్ ఫర్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌ హెడ్‌ సౌమిత్ర దాస్‌ తెలిపారు. 
 
అంతేగాక, ఈ రకం వైరస్‌పై భారత్‌లో అందుబాటులో ఉన్న కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు మెరుగ్గా పనిచేస్తున్నాయని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్‌ అండ్ ఇంటిగ్రేటివ్‌ బయోలజీ తెలిపింది.