శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 జూన్ 2020 (17:17 IST)

కియా మోటార్స్‌లో కరోనా కేసు : పలువురు ఉద్యోగులకు క్వారంటైన్

అనంతపురం జిల్లాలోని పెనుకొండలోని కియా మోటార్స్ కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. దీంతో అతనితో సన్నిహితంగా మెలిగిన ఉద్యోగులందరినీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. ఈ విషయాన్ని కంపెనీ కూడా ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
రెండు నెలల లాక్డౌన్ తర్వాత ఇటీవలే కేంద్రం ఇచ్చిన లాక్డౌన్ సండలింపుల తర్వాత కియా మోటర్స్ తిరిగి ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ ఫ్యాక్టరీకి వచ్చే ఉద్యోగులందరికీ ప్రధాన ముఖద్వారం వద్ద అన్ని రకాల పరీక్షలు చేసి లోనికి అనుమతిస్తూ వచ్చారు. 
 
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఓ ఉద్యోగి కరోనా బారినపడటం అటు సంస్థ యాజమాన్యాన్ని కలవరపెడుతోంది. ఆ ఉద్యోగి కియా మోటార్స్‌లోని బాడీ షాపులో విధులు నిర్వర్తిస్తుంటాడని, తమిళనాడుకు చెందినవాడని తెలుసుకున్నారు. 
 
ఈ నెల 25న ఇతను కర్మాగారానికి వచ్చాడు. వైద్య పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దాంతో అతడ్ని శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ ప్రాంగణంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. 
 
అధికారులు అతడితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా కియో మోటార్స్ కూడా ఇటీవలే తెరుచుకుంది.