సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2020 (17:26 IST)

సరిగా అన్నం పెట్టడం లేదని క్వారంటైన్‌ నుంచి పారిపోయిన సబ్ కలెక్టర్

ఆయనో జిల్లాకు సబ్ కలెక్టర్. బాధ్యతాయుతమైన విధులను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పనిమీద ఇటీవలే సింగపూర్ పర్యటనకు వెళ్లి వచ్చారు. వస్తూ వస్తూ కరోనా వైరస్ సోకించుకుని వచ్చారు. దీంతో ఆయన్ను తనిఖీ చేయగా కరోనా వైరస్ సోకినట్టు తేలడంతో విమానాశ్రయం నుంచి నేరుగా క్వారంటైన్‌కు తరలించారు. అయితే, రెండు మూడు రోజుల తర్వాత.. తనకు సరిగా అన్నం పెట్టడంలేదని దొంగతనంగా తన సొంతూరికి పారిపోయాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. 
 
ఆ సబ్ కలెక్టర్ పేరు అనుపమ్ మిశ్రా. కొల్లాం సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన సింగపూర్ పర్యటన చేసి స్వదేశానికి వచ్చారు. నిబంధనల ప్రకారం, ఆయన్ను క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించడానికి వచ్చిన వైద్యులకు అనుపమ్ మిశ్రా కనిపించలేదు. ఆయనకు ఫోన్ చేయగా, తన స్వగ్రామమైన కాన్‌పూర్‌లో ఉన్నానని సమాధానం ఇచ్చారు. ఈ విషయాన్ని కొల్లాం జిల్లా కలెక్టర్‌ అబ్దుల్ నాసర్‌కు చేరవేశారు. అంతే.. ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
 
ఓ బాధ్యతాయుతమైన అధికారి క్వారంటైన్ నుంచి తప్పించుకోవడంతో ఇతర అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. అబ్దుల్ నాసర్ ఆదేశాలతో అనుపమ్ మిశ్రాపై కేసు నమోదు చేశారు. కాగా, క్వారంటైన్‌లో ఉన్న ఆయనకు సరైన ఆహారం పెట్టడం లేదని, ఈ కారణంతోనే ఆయన స్వస్థలానికి వెళ్లిపోయారని కొందరు అధికారులు వ్యాఖ్యానించడం గమనార్హం.