ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 మార్చి 2022 (13:44 IST)

తగ్గుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు - పెరుగుతున్న మృతులు

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. మరోవైపు, మరణాలు మాత్రం పెరుగుతున్నాయి. ఇది ఆరోగ్య శాఖ అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2568 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో 97 మంది మృత్యువాతపడ్డారు. అలాగే, 4722 మంది కోలుకున్నారు. 
 
అయితే, దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నప్పటికీ.. మరణాలు పెరగడం ఇపుడు ఆందోళన కలిగిస్తుంది. సోమవారం వెల్లడించిన ప్రకటన మేరకు 27 మంది చనిపోగా, ఈ సంఖ్య మంగళవారానికి 97కి చేరింది. కాగా, తాజాగా నమోదైన మరణాల్లో ఒక్క కేరళ రాష్ట్రంలోనే 78గా ఉండటం ఆందోళన కలిగిస్తుంది. 
 
చైనాను వణికిస్తున్న 'స్టెల్త్ ఒమిక్రాన్' 
 
కరోనా వైరస్‌కు పుట్టినిల్లు అయిన చైనా ఇపుడు అదే వైరస్ దెబ్బకు వణికిపోతోంది. స్టెల్త్ ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిగా తీవ్ర స్థాయిలో ఉంది. దీంతో చైనాలోని అనేక కీలక నగరాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నారు. 
 
ఒమిక్రాన్ ఉప వేరియంట్ అయిన స్టెల్త్ ఒమిక్రాన్‌గా పిలుస్తున్న బి.ఏ.2 కారణంగా పలు నగరాలు క్రమంగా లాక్డౌన్‌లోకి వెళ్లిపోతున్నాయి. అయితే, ఈ వేరియంట్‌తో మరణాలు సంభవించే అవకాశం పెద్దగా ఉండకపోవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
అయితే, పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం విపరీతంగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,337 కేసులు నమోదు కావడం, ఒక్క జిలిన్ ప్రావిన్స్‌లోనే 895 కేసులు వెలుగు చూడటంతో ప్రభుత్వం ఆంక్షలను కట్టుదిట్టం చేసింది. రాజధాని బీజింగ్‌లో ఆరు కేసులు, షాంఘైలో 41 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.