శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 జులై 2020 (13:07 IST)

హమ్మయ్య.. కోవిడ్-19 వ్యాక్సిన్స్ ట్రయల్స్ ప్రారంభం.. అమెరికా అదుర్స్

ప్రపంచలోనే అతిపెద్ద కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రయోగానికి అమెరికా నడుంబిగించింది. కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న సంస్థల్లో అమెరికాలోని బయోటెక్ కంపెనీ మోడర్నా ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి ఈ సంస్థకు అమెరికా ప్రభుత్వమే నిధులు సమకూర్చింది. ఇక ఈ సంస్థ తమ లాస్ట్ స్టేజ్ ట్రయల్స్‌ను సోమవారం ప్రారంభించింది. 
 
ఈ ట్రయల్‌లో కొవిడ్-19 వల్ల తలెత్తే శ్వాసకోస సమస్యలు లేని దాదాపు 30 వేల మంది యుక్తవయసున్న వాలంటీర్లు పాల్గొన్నారు. కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్‌ కోసం యావత్‌ ప్రపంచం ఆశగా ఎదురుచూస్తోన్న నేపథ్యంలో ట్రయల్స్ ప్రారంభం కావడంపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 
 
అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌, మోడెర్నా కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను నేడు 30 వేల మంది వాలంటీర్లపై ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. ఇందుకోసం అవసరమైన డోసులను సిద్ధం చేసినట్లు మోడెర్నా తెలిపింది. ఈ వ్యాక్సిన్‌ పరీక్షలను మోడెర్నా మార్చిలోనే ప్రారంభించింది. తొలుత 45 మంది వాలంటీర్లపై ప్రయోగించింది.
 
అందులో సానుకూల ఫలితాలు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం భారీ ఎత్తున నిర్వహించే పరీక్షలతో వ్యాక్సిన్‌ అసలు సామర్థ్యం బయటపడే అవకాశముందంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ఈ కంపెనీపై పెట్టుబడిని రెట్టింపు చేసింది. 
 
గతంలో 483 మిలియన్ల డాలర్లను అమెరికా ప్రకటించింది. తాజాగా వ్యాక్సిన్ తయారీ సంస్థకు అదనంగా 472 మిలియన్ల డాలర్లు కేటాయించింది. మోడెర్నా బయోటెక్నాలజీ కంపెనీ ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా తెలిపింది.