శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 జులై 2020 (10:06 IST)

కరోనా వైరస్ అప్‌డేట్స్ : కొత్త కేసులు 47704 - మరణాలు 654

దేశంలో కరోనా వైరస్ కొత్త కేసుల నమోదు వేగంలో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. గడచిన 24 గంటల్లో కొత్తగా 47704 కేసులు నమోదయ్యాయి. అలాగే, 654 మంది ఈ వైరస్ సోకి చనిపోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 
 
కాగా, దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 14,83,157కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 33,425కి పెరిగింది. 4,96,988 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 9,52,744 మంది కోలుకున్నారు.
 
కాగా, నిన్న, మొన్న వరుసగా ఐదు లక్షల కంటే అధికంగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొన్న ఒక్కరోజులోనే 5,15,000 శాంపిళ్లను పరీక్షించగా, నిన్న 5,28,000 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది.
 
ఇదిలావుంటే, తెలంగాణలో కరోనా వైరస్ ఉద్ధృతికి అడ్డుకట్ట పడటంలేదు. సోమవారం కొత్తగా మరో 1610 మంది కరోనా బారినపడినట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. అలాగే, సోమవారం 9 మంది కరోనాతో మృతి చెందారు. ఫలితంగా రాష్ట్రంలో కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 480కి చేరుకోగా, మొత్తం కేసుల సంఖ్య 57,142కు పెరిగింది.
 
కరోనా నుంచి నిన్న 803 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 42,909కి పెరిగింది. రాష్ట్రంలో ఇంకా 13,753 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక సోమవారం నమోదైన మొత్తం కేసుల్లో 531 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. 
 
ఆ తర్వాత అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 340, రంగారెడ్డి జిల్లాలో 172, వరంగల్ అర్బన్ 152, మేడ్చల్ మల్కాజిగిరిలో 113, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో 48 చొప్పున, సూర్యాపేటలో 35, ములుగులో 32, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 26 చొప్పున, మహబూబ్‌నగర్‌లో 23 కేసులు నమోదయ్యాయి. అలాగే, ఇప్పటివరకు 3,79,081 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ఇంకా 809 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది.