కరోనా ఉగ్రరూపం.. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 40వేలకు చేరువలో కేసులు
దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. కరోనా కొత్త కేసులు భారీగా పెరిగాయి. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 40వేలకు చేరువలో కొత్త కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 39వేల 726కి కరోనా నిర్ధరణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసులు 1.15 కోట్లకు చేరాయి. క్రితం రోజు 35వేల 871 కరోనా కేసులు, 172 మరణాలు నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో రోజువారీ కేసుల్లో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదవడం దేశంలో ఇదే తొలిసారి.
గడిచిన 24 గంటల్లో 154మంది కోవిడ్‌కు బలయ్యారు. దీంతో దేశంలో కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం లక్షా 59వేల మంది కోవిడ్ తో చనిపోయారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.
రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులూ పెరిగాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2లక్షల 71వేలకి చేరింది. కాగా, కోటి 10లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు 3కోట్ల 71లక్షల(3కోట్ల 71లక్షల 43వేల 255మందికి) మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు.