గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 17 మార్చి 2021 (17:52 IST)

మార్కెట్‌ నుంచి 2000 రూపాయిల నోట్లు ఎందుకు మాయమవుతున్నాయి? ప్రభుత్వం గప్‌చుప్‌గా దాచేస్తోందా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 నవంబరు 08వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ మరుసటి రోజు నుంచే పెద్ద కరెన్సీ నోట్లు చెల్లబోవని చెప్పారు. వాటి స్థానంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త 2000, 500 నోట్లను ప్రవేశపెట్టింది.

 
అప్పటి నుంచి కొత్త 500 రూపాయిల నోట్లు ఇప్పటికీ చలామణిలో ఉన్నాయి. కానీ.. గత రెండేళ్లలో 2,000 రూపాయిల నోటు మాత్రం క్రమంగా కనుమరుగవుతోంది. ముందుగా ఏటిఎంల నుంచి, ఆ తర్వాత బ్యాంకుల నుంచి మాయమైంది. ఆర్‌బీఐ 2019, 2020 సంవత్సరాలలో 2000 రూపాయిల నోటును ప్రింటింగ్ చేయలేదని కేంద్ర ఆర్ధికమంత్రి అనురాగ్ ఠాకూర్ ఇటీవల లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ తెలిపారు. ఇది ప్రజలను అయోమయానికి గురి చేసింది. పాత 500, 1000 రూపాయిల నోట్ల లాగే ఈ కొత్త 2,000 రూపాయల నోటును కూడా రద్దు చేస్తారా? అందుకోసమే చలామణి నుంచి తప్పించారా?

 
2000 రూపాయిల నోట్లు ఎక్కడికి వెళ్లాయి?
ముందుగా.. 2000 రూపాయిల నోట్లను వాడుక నుంచి రద్దు చేయలేదు. ఒక వేళ మీ దగ్గర 2,000 రూపాయిల నోట్లు ఉంటే వాటిని వాడవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐతో కలిసి ఆ నోట్ల వాడకాన్ని తగ్గించి 500 రూపాయిల పంపిణీని పెంచాలని నిర్ణయించింది. ఇది ప్రభుత్వ ఆర్ధిక విధానంలో భాగం. నోట్ల రద్దు సమయంలో కొన్ని లక్షల కోట్ల రూపాయిలు మార్కెట్ నుంచి మాయమవుతాయి అని అర్ధం అవుతోంది.

 
ఆ సమయంలో ఏర్పడే తాత్కాలిక అత్యవసర పరిస్థితి నుంచి ప్రజలను రక్షించేందుకు ఒక పెద్ద డినామినేషన్ ఉన్న నోటును మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వీటి పంపిణీని దశల వారీగా నిలిపివేశారు. ఆర్ధిక వేత్తలు వసంత్ కులకర్ణి, చంద్రశేఖర్ ఠాకూర్ బీబీసీకి ఈ విషయాన్ని మరింత విశదీకరించారు.

 
"ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటించే నాటికి దేశంలో 86 శాతం కరెన్సీ 500, 1000 రూపాయిల నోట్లలో చెలామణి అయ్యేది. అవి రాత్రికి రాత్రే రద్దు చేశారు. ఆ సమయంలో ప్రజల దగ్గర డబ్బు ఉండదు. వాటిని ఎక్కువ మొత్తంలో ప్రింట్ చేసి పంపిణీ చేయడం కష్టం. ఆ తర్వాత నెమ్మదిగా తక్కువ విలువ ఉన్న నోట్లను మార్కెట్ లోకి ప్రవేశపెట్టి పెద్ద నోట్లను దశల వారీగా తొలగించారు" అని వసంత్ కులకర్ణి చెప్పారు.

 
"మార్కెట్లో ఉన్న దొంగ నోట్లను అంతం చేసి ఆర్ధిక అస్థిరతను నిరోధించాలనే లక్ష్యంతో నోట్ల రద్దును ప్రకటించారు. అయితే, పెద్ద డినామినేషన్ ఉన్న నోట్ల వలన దొంగ నోట్లు పంపిణీ అయ్యే ముప్పు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఎప్పుడైనా ఆర్ధిక అనిశ్చితి తలెత్తినప్పుడు వీటిని వాడేందుకు దాచి ఉంచుతారు. అందుకే వాటిని తగ్గించడం ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటి" అని పేర్కొన్నారు. "అంతే కాకుండా, పేద వారికి, మధ్య తరగతి ప్రజలకు 2000 రూపాయిల నోట్ల అవసరం పెద్దగా ఉండదు. వారికి 500 రూపాయిల నోటు సరిపోతుంది" అని ఠాకూర్ వివరించారు.

 
2000 రూపాయిల నోట్ల పంపిణీని ఎలా తగ్గించారు?
2000 రూపాయిల నోటు గురించి కేంద్ర ఆర్ధికమంత్రి తమ నిర్ణయాన్ని ఎప్పటి కప్పుడు లోక్‌సభలో చెబుతూ రావడం మాత్రమే కాకుండా అది ఆర్‌బీఐ విధానంలో కూడా స్పష్టం చేస్తోంది. 2019లో 329.10 కోట్ల విలువ చేసే 2000 రూపాయిల నోట్లు పంపిణీలో ఉన్నట్లు అనురాగ్ ఠాకూర్ 2020లో చెప్పారు. మార్చ్ 2020 నాటికి వీటి విలువ 273.98 కోట్ల రూపాయలకు పడిపోయింది. గత రెండు సంవత్సరాలలో కొత్తగా 2000 రూపాయిల నోట్లను ప్రచురించలేదని ఆయన లోక్‌సభలో చెప్పారు.

 
2000 రూపాయిల నోటు విలువ క్రమంగా తగ్గిపోతోందని దీనిని బట్టి అర్ధం అవుతోంది. ఇదే విధానాన్ని అనుసరిస్తూ ఆర్‌బీఐ కూడా 2000 రూపాయిల నోట్లను ఏటీఎంల నుంచి తొలగించాలని బ్యాంకులను ఆదేశించింది. దాంతో 2020 మార్చి నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న 2 లక్షల 40 వేల ఏటీఎంల నుంచి 2000 రూపాయిల నోట్లను తొలగించి వాటి స్థానంలో 500, 200, 100 రూపాయిల నోట్లను ప్రవేశపెట్టారు. నెమ్మదిగా బ్యాంకులలో కూడా 2000 రూపాయల నోట్లు కనుమరుగయ్యాయి. అయితే, వాటిని రద్దు చేయలేదని, వాటి వాడకం మాత్రమే తగ్గిందని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతూ వచ్చాయి.

 
వీటిని తగ్గించాల్సిన అవసరం ఏమిటి?
భారీ ఆర్ధిక కుంభకోణాలు జరగకుండా ఆపాలంటే పెద్ద నోట్ల సరఫరాను కూడా ఆపడం ఒక పరిష్కారమని ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధికవేత్తలంతా భావిస్తున్నారు. ఇలాంటి నోట్ల పంపిణీ ఆగిపోతే, మోసాలు తగ్గుతాయని అంటున్నారు. మహారాష్ట్రలో అర్థ క్రాంతి అనే ఆర్ధిక ఉద్యమాన్ని లేవనెత్తిన అనిల్ బొకిల్ ఈ 2000 రూపాయిల నోటు వాడకాన్ని తగ్గించడంలో కీలక పాత్ర వహించారు. ఈ ఆర్ధిక విప్లవం గురించి ఆయన సహ ఉద్యమకారుడు ప్రశాంత్ దేశ్ పాండే బీబీసీకి వివరించారు.

 
"ఆర్ధికపరమైన అవకతవకలు చేసేందుకు వాడే దొంగ నోట్లు ఎక్కువగా పెద్ద డినామినేషన్లలోనే ఉంటాయి. అంతే కాకుండా, ఈ దొంగ నోట్లు భారతదేశంలోకి ప్రవేశించే ముందు చాలా చోట్లకు ప్రయాణం చేసి వస్తాయి. ఈ మజిలీలో ప్రతి చోటా ఏజెంట్లు వారి కమీషన్ తీసుకుంటారు’’ అని చెప్పారాయన. "ఈ దొంగ నోట్లు ఎంత పెద్ద విలువ గల నోట్లయితే వారికి లాభం అంత ఎక్కువగా ఉంటుంది. దొంగ నోట్లను ముద్రించే వారు వేసుకునే సాధారణ ఆర్ధిక లెక్కలివి" అని పేర్కొన్నారు.

 
"ఇదే విధానాన్ని అనుసరిస్తూ కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయిల నోట్ల వాడకాన్ని తగ్గించేసింది" అని దేశ్ పాండే చెప్పారు. "అమెరికా, యూకే లాంటి అభివృద్ధి చెందిన దేశాలను పరిశీలిస్తే అక్కడ 100 డాలర్లు, లేదా పౌండ్లను మించిన నోట్లు ఉండవు" అని ఉదహరించారు.

 
డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత
"డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తే అన్ని లావాదేవీలు రికార్డులో ఉండి ఆర్ధిక నిర్వహణలో అవకతవకలను తగ్గిస్తుంది" అని ఠాకూర్ పేర్కొన్నారు. "డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తే 2000 రూపాయిల నోట్ల అవసరమే ఉండదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గమనించి ఈ సానుకూల చర్యను చేపట్టింది" అని చెప్పారాయన.