గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (08:37 IST)

భారత్‌లో కరోనా టీకాల కొరత? హర్షవర్థన్ ఏమంటున్నారు?

కరోనా కష్టకాలంలో ప్రపంచ దేశాలకు భారత్ ఓ సంజీవనిగా మారింది. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే టీకాలను అభివృద్ధి చేసి అనేక ప్రపంచ దేశాలకు భారీ మొత్తంలో ఎగుమతి చేస్తోంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ భారత్‌పై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నాయి. 
 
అయితే, టీకాలను ఉత్పత్తి చేసే భారత్‌లో మాత్రం కరోనా వ్యాక్సిన్ కొరత ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్థన్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు అవసరమైన మొత్తంలో టీకా సరఫరా జరగుతుందన్నారు. దేశంలో కరోనా టీకాల కొరత లేదని, పుష్కలంగా నిల్వ ఉన్నాయన్నారు. అదేసమయంలో కరోనా వ్యాక్సిన్ డోస్‌లు వృధా కాకుండా చూడాలని ఆయన కోరారు. 
 
ఇప్పటివరకూ ప్రజలకు 8.4 కోట్ల టీకా డోసులు వేశామని కూడా మంత్రి తెలిపారు. రాత్రి 8.00ల వరకూ ఉన్న లెక్కల ప్రకారం.. మంగళవారం ఒక్కరోజే 562807 టీకాలు వేశామని ఆయన తెలిపారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల తర్వాత ముఖ్యమంత్రులతో సమావేశమై కరోనా సంక్షోభంపై చర్చిస్తారని తెలిపారు. దేశంలో ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల్లో 80 శాతం వాటా 11 రాష్ట్రాలదని కూడా మంత్రి తెలిపారు. 
 
మరోవైపు, దేశంలో పెరిగిపోతున్న కొత్త పాజిటివ్ కేసులపై ఆయన స్పందిస్తూ, స్థానిక ఎన్నికలు, రైతు నిరసనలు, పెళ్లి వేడుకల కారణంగా పలు చోట్ల కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు.