శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (17:13 IST)

ఆ రాష్ట్రాల్లో ఒక్క కరోనా మరణం కూడా లేదు : కేంద్ర ఆరోగ్య శాఖ

దేశంలో గత 24 గంటల్లో 19 రాష్ట్రాల్లో ఒక్కటంటే ఒక్క కరోనా మరణం కూడా లేదని కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ వెల్లడించింది. గడచిన 24 గంటల్లో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదవ్వలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. 
 
వీటిల్లో పశ్చిమబెంగాల్‌, గుజరాత్, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, బిహార్‌, లక్షద్వీప్‌, లద్దాఖ్‌, సిక్కిం, త్రిపుర, మణిపుర్‌, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు, డయ్యుడామన్‌ దాద్రానగర్‌ హవేలీ, అరుణాచల్‌ ప్రదేశ్‌లు ఉన్నాయి. 
 
మొత్తంగా 91 మరణాలు నమోదవ్వగా మహారాష్ట్ర (30), పంజాబ్‌ (18), కేరళ (13) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 80 శాతం కేసులు 5 రాష్ట్రాల నుంచే నమోదైనట్లు వారు తెలిపారు. వాటిలో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, తమిళనాడు, గుజరాత్‌ ఉన్నాయి. 
 
మరోవైపు దేశంలో రికవరీల సంఖ్య 1,07,98,921కు చేరుకోగా రికవరీ రేటు 97.07 శాతంగా ఉంది. క్రియాశీల కేసులు 1,68,358 ఉండగా ఆ రేటు 1.51గా ఉంది. యూకే, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాల్లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా స్ట్రెయిన్‌ల సంఖ్య దేశంలో 213కి చేరింది. అందులో యూకే స్ట్రెయిన్‌ 187, దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌ 6, బ్రెజిల్‌ రకం ఒకరికి సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 
 
ఇదిలావుంటే 60 యేళ్లకు పైబడిన వారికి సోమవారం నుంచి ప్రారంభించిన రెండో విడత వ్యాక్సిన్‌ పంపిణీ నిరాటంకంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ఏడు గంటల వరకు కోటీ యాభైలక్షల మందికి టీకా వేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. సోమవారం ఒక్క రోజే 29 లక్షల మంది కోవిన్‌ పోర్టల్‌లో వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు వారు తెలిపారు.