1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 డిశెంబరు 2021 (17:03 IST)

12 దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు

ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ కరోనా వేరియంట్‌ను ఇప్పటివరకు 12 ప్రపంచ దేశాల్లో గుర్తించారు. గత నెల 14వ తేదీన సౌతాఫ్రికాలో తొలిసారి ఈ వైరస్‌ను గుర్తించారు. ఆ తర్వాత ఈ వైరస్ తమతమ దేశాల్లో ప్రవేశించకుండా అన్ని ప్రపంచ దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, ఈ వేరియంట్ ఏదో రూపంలో వెళుతుంది. ఇప్పటివరకు ఏకంగా 12 దేశాల్లో గుర్తించారు. ఈ దేశాలన్నింటిలోకెల్లా.. అత్యధిక కేసులను సౌతాఫ్రికాలోనే గుర్తించారు. 
 
ప్రస్తుతం యూరప్ దేశాలతో పాటు.. ఇజ్రాయిల్, జపాన్ వంటి దేశాల్లో కూడా ఈ వేరియంట్ వెలుగు చూసింది. దీంతో ఆయా దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు, భారత్‌లో కూడా ఈ వైరస్ వ్యాపించకుండా కేంద్ర ఆరోగ్యం శాఖ సరికొత్త మార్గదర్శకాలను జారీచేసింది. 
 
అయితే, దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారిలో ఆరుగురికి పాజిటివ్ అని తేలింది. అయితే, వీరికి సోకింది ఒమిక్రాన్ వైరస్సా లేదా ఇతర వేరియంటా అనే విషాయాన్ని నిర్ధారించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు శాంపిల్స్ పంపించారు.