1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (09:25 IST)

తెలంగాణ సర్కారు ముందు చూపు : కరోనా థర్డ్ వేవ్ కోసం సన్నద్ధత

దేశంలో కరోనా మూడో దశ వ్యాప్తి పొంచివుందని వైద్య నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ కరోనా మూడో విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్రప్రభుత్వం ముందస్తుగానే చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసింది. ఇందుకోసం అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించింది. పనిలోపనిగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. వీటికి ఆమోదం తెలుపుతూ కేంద్రం ఎమర్జెన్సీ కొవిడ్‌ రెస్పాన్స్‌ ప్లాన్‌ఫేజ్‌ 2 కింద రాష్ట్రానికి నిధులు కేటాయించింది. 
 
కరోనా వైరస్ వ్యాప్తి చర్యల్లో భాగంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం ఖర్చుతో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నాయి. రూ.456 కోట్లతో కొవిడ్‌ అత్యవసర మందులు, ఐసీయూ పడకలు, నిర్ధారణ పరీక్షల కేంద్రాలు, చిన్న పిల్లలకు ఐసీయూలు, అదనపు పడకలు ఇతర సదుపాయాలు కల్పించనున్నారు.
 
ఈ ముందుస్తు చర్యల్లో భాగంగా, రాష్ట్రంలోని అన్ని ప్రధాన దవాఖానల్లో 850 ఐసీయూ బెడ్ల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా ఉండే దవాఖానల్లో వీటిని ఏర్పాటుచేస్తారు. వీటిల్లో నిమ్స్‌కు కొత్తగా 200 ఐసీయూ బెడ్లు కేటాయించారు. టిమ్స్‌, గాంధీ, మహబూబ్‌నగర్‌ జనరల్‌ దవాఖానలకు 100 చొప్పున, ఉస్మానియాకు 75 బెడ్లను మంజూరుచేశారు. 
 
ఆదిలాబాద్‌ రిమ్స్‌తోపాటు సిద్దిపేట, నిజామాబాద్‌, సూర్యాపేట, నల్లగొండ జనరల్‌ దవాఖానల్లో 50 చొప్పున ఏర్పాటుచేస్తున్నారు. ఒక్కోబెడ్‌కు రూ.16.85 లక్షల చొప్పున ఖర్చుచేసేలా ప్రభుత్వం నిధులు ఇస్తున్నది. అన్నిచోట్ల 20 శాతం ఐసీయూ బెడ్లను పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 16 జిల్లాల్లో ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లు ఏర్పాటుచేయగా, మిగిలిన 17 జిల్లాల్లోనే ఏర్పాటుచేయబోతున్నారు.