ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

ప్రియాంక గాంధీకి మళ్లీ కరోనా పాజిటివ్.. దేశంలో కొత్తగా 16047 కేసులు

priyanka gandhi
కాంగ్రెస్ పార్టీలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుంది. ఆ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేకు రెండోసారి ఈ వైరస్ సోకింది. దీంతో ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. తాజాగా ఆ పార్టీ మహిళా నేత ప్రియాంకా గాంధీకి ఈ వైరస్ సోకింది. తనకు కరోనా వైరస్ సోకినట్టు ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు.. అన్ని నిబంధనలు పాటిస్తున్నట్లు చెప్పారు.
 
ఇదిలావుంట, ఐదు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ధరల పెరుగుదల, అగ్నిపథ్‌, నిత్యావసరాలపై జీఎస్టీ పెంపు వంటి అంశాలపై ఈ ఆందోళన నిర్వహించింది. ఢిల్లీలో జరిగిన నిరసనల్లో ప్రియాంక, ఖర్గే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌, ఎంపీలు, నేతలు పాల్గొన్నారు. ఇపుడు ఒక్కొక్కరుగా కరోనా వైరస్ బారినపడుతుండటంతో కాంగ్రెస్ నేతల్లో ఆందోళన మొదలైంది. 
 
ఇదిలావుంటే, గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 16047 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 3.25 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 16,047 మందికి వైరస్ సోకింది. 54 మంది మరణించారు. 19,539 మంది కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 4.94 శాతంగా నమోదైంది. క్రియాశీల కేసులు 1.28 లక్షలకు చేరాయి.