శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 6 మార్చి 2020 (15:37 IST)

కరోనా అనుమానితుడు ఆసుపత్రి నుంచి పరార్, పట్టుకోండి, పట్టుకోండి

కరోనా వైరస్ సోకితే ఇక ఆ రోగికి కుటుంబ సభ్యులతో పాటు బయట స్నేహితులతో కూడా సంబంధం లేకుండా అయిపోతుంది. ఎందుకంటే ఆ వైరస్ అంత ప్రమాదకారి. రోగి నుంచి చాలా సులభంగా ఇతర వ్యక్తికి సోకుతుంది. ప్రాణాలు తీస్తుంది. అందువల్ల కరోనా వైరస్ సోకిన రోగి అంటే వైద్యులు వెంటనే అప్రమత్తం అవడమే కాకుండా అతడిని ప్రత్యేకంగా ఐసోలేటెడ్ గదిలో వుంచి చికిత్స అందిస్తున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... పంజాబ్ రాష్ట్రంలోని మోఘాలో ఓ వ్యక్తి తీవ్రమైన జలుబు, దగ్గుతో విపరీతంగా బాధపడుతున్నాడు. దీనితో అతడు తనకు కరోనా వ్యాధి వచ్చిందేమోనని అనుమానంతో ఆసుపత్రికి వెళ్లాడు. అతడిని చూసిన వైద్యులు ప్రత్యేక గదిలో వుంచి రక్త నమూనాలు సేకరించారు. ఇంతలో ఈ విషయం కాస్తా మీడియాకు లీకవ్వడంతో అంతా కెమేరాలు, వాహనాలు తీసుకుని అక్కడికి వెళ్లారు. 
 
ప్రత్యేక గదిలో వున్న వ్యక్తిని ఫోటోలు, వీడియోలు తీసి వాటిని ప్రసారం చేయడమే కాకుండా సదరు వ్యక్తికి కరోనా అనుమానం అంటూ వార్తలు స్క్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీనితో అతడి కుటుంబ సభ్యులు ఇవి చూసి ఆందోళన చెందారు. ఇది తెలుసుకున్న సదరు వ్యక్తి ఆసుపత్రి నుంచి చెప్పాపెట్టకుండా పారిపోయాడు. విషయం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది షాక్ తిన్నది. వెంటనే పోలీసులను వెంటబెట్టుకుని ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి నచ్చ చెప్పి తిరిగి ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. ప్రస్తుతం అతడి బ్లడ్ శాంపిళ్లు పంపి అతడికి కరోనా వుందా లేదా అని చెక్ చేస్తున్నారు.