దేశంలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. నిన్నటికి నిన్న 25 వేలుగా ఉన్న ఈ కేసుల సంఖ్య గత 24 గంటల్లో ఏకంగా 35 వేలు దాటిపోయాయి. కొత్తగా 37,593 మంది వైరస్ సోకినట్లు తేలింది. మరో 648 మంది మహమ్మారి కారణంగా మరణించారు.
కొత్తగా ఒక్క రోజు వ్యవధిలో 34,169 మంది కరోనాను జయించారు. అయితే తాజా కేసుల్లో 64.6 శాతం కేసులు ఒక్క కేరళలోనే వెలుగుచూశాయి. సోమవారం ఆ రాష్ట్రంలో 24,296 కొత్త కేసులు నమోదయ్యాయి. మే 26 (28,798 కేసులు) తర్వాత కేరళలో 24వేల పైన కేసులు నమోదవడం మళ్లీ ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఇదిలావుంటే, దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,25,12,366గా ఉంటే, మొత్తం మరణాలు 4,35,758గాను, మొత్తం కోలుకున్నవారు 3,17,54,281గాను, యాక్టివ్ కేసులు 3,22,327 చొప్పున ఉన్నాయి.
ఇదిలావుంటే, మంగళవారం ఒక్కరోజే 61,90,930 కరోనా వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు 59,55,04,593 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.