మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 మార్చి 2021 (13:07 IST)

తెలంగాణ శాసన మండలిలో కరోనా కలకలం.. ఎమ్మెల్సీకి పాజిటివ్

Puranam Satish
తెలంగాణ శాసన మండలిలో కరోనా కలకలం రేపింది. ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ కరోనా బారిన పడ్డారు. శనివారం మండలికి హాజరై మాట్లాడిన పురాణం సతీష్‌ సోమవారం హాజరు కాలేదు. అయితే ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మండలి సభ్యులు, సిబ్బందిలో కలవరం మొదలైంది. మరోవైపు తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. కొత్తగా 337 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
కోవిడ్ బారిన పడి నిన్న ఇద్దరు బాధితులు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 337 కేసులు నమోదవగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 91 కేసులు వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2 వేల 958 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3 లక్షల 5 వేలకు చేరువయ్యాయి. 
 
మరోవైపు శాసన మండలిలో కరోనా కలకలం రేపిన తరుణంలో సభ్యులందరూ కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. కరోనా నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 26వరకు అసెంబ్లీ సమావేశాలు సాగాల్సి ఉంది. అయితే. ఈనెల 24నే ద్రవ్య వినిమయ బిల్లు పెట్టి, అసెంబ్లీని వాయిదా వేయాలని ఆలోచిస్తున్నారు. స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతోంది.