గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (10:56 IST)

ఏపీలో తగ్గుతున్న మరణాలు - దేశంలో పెరుగుతున్న కేసులు

ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో కరోనా మరణాలు సంభవించాయి. అయితే పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడ్డట్టు కనిపిస్తోంది. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. ఏపీలో కరోనా మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతోందని పేర్కొంది. 
 
వారానికి 4.5 శాతం తగ్గుదల నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. అదేసమయంలో మహారాష్ట్రలో 11.5 శాతం, తమిళనాడులో 18.2 శాతం తగ్గుదల నమోదైందని వివరించారు.
 
అదేవిధంగా తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం... రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,478 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,011 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,35,884కి చేరింది. తెలంగాణలోని ఆసుపత్రుల్లో 32,994 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 1,02,024 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 866కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 267 కరోనా కేసులు నమోదయ్యాయి.  
 
మరోవైపు, కర్ణాటక, ఢిల్లీలో కరోనా మరణాలు పెరుగుతున్నాయని వెల్లడించారు. ఢిల్లీలో వారానికి 50 శాతం, కర్ణాటకలో రోజుకు 9.6 శాతం పెరుగుదల కనిపిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త గణాంకాలతో పోల్చితే భారత్ లో ప్రతి 10 లక్షల మందిలో 2,792 పాజిటివ్ కేసులు, 49 మరణాలు సంభవిస్తున్నాయని రాజేశ్ భూషణ్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 30 లక్షల మంది కోలుకున్నారని వెల్లడించారు.
 
ఇకపోతే, దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసుల సంఖ్య 39 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 83,341 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం వెల్లడించిన బులెటిన్‌లో పేర్కొంది. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 1,096 మంది మృతి చెందారు.
 
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 39,36,748కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 68,472 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 30,37,152 మంది కోలుకున్నారు. 8,31,124 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 4,66,79,145 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,69,765 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.