శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2020 (13:30 IST)

కరోనావైరస్ అంటే ఏమిటి?.. కోవిడ్-19 అంటే ఏమిటి? ఎన్నో విషయాలు ఇక్కడ

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. కొన్ని దేశాల్లో కరోనా కేసుల తీవ్రత తగ్గుతున్నప్పటికీ మన దేశంలో కేసులు మాత్రం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కరోనా వైరస్ పై ప్రజల్లో ఉన్న అనేక అనుమానాలకు, సందేహాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యు.హెచ్.ఓ) సూచనలు, సమాధానాలు ఇచ్చింది.

ప్రజలు కూడా కరోనా వైరస్ గురించి పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవడంతోపాటు ముఖ్యంగా కరోనా వైరస్ ఎంటే ఏమిటి? లక్షణాలు, వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు, మాస్కులు ధరించడం, ఒకవేళ వ్యాధి సోకితే ఎవరిని సంప్రదించాలి? లాంటివి ఈ కింద ఇవ్వబడిన అంశాలు ఎంతో ఉపయోగపడతాయి. 
 
కరోనా వైరస్ అంటే ఏమిటి?
కరోనా వైరస్ అనేది వైరస్ ల యొక్క పెద్ద కుటుంబం. భూమి మీద ఉన్న అనేక వైరస్‌ల్లాగే కరోనా వైరస్ జంతువులకు లేదా మనుషులకు హాని కలిగిస్తుంది. ఈ కరోనా వైరస్‌లు సాధారణ జలుబు మొదలుకొని ప్రాణాంతకమైన మిడిల్ ఈస్ట్ రెస్పిటరీ సిండ్రోమ్ మరియు సివియర్ అక్యూట్ రెస్పిటరీ సిండ్రోమ్ వంటి వ్యాధులను మానవులకు కలిగిస్తాయి. అయితే ఇటీవలే కనిపెట్టిన కొత్త కరోనా వైరస్  కోవిడ్-19 అనే వ్యాధిని కలిగిస్తుంది.
 
కోవిడ్-19 అంటే ఏమిటి?
కోవిడ్-19 అనేది ఇటీవల కనుగొన్న కరోనా వైరస్ ద్వారా వ్యాప్తి చెందేది.  2019 డిసెంబర్ లో చైనాలోని వూహాన్‌ నగరంలో బయటపడినప్పుడే ఈ వైరస్ మరియు వ్యాధి గురించి ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను ప్రభావితం చేస్తున్న మహమ్మారిగా మారింది.
 
కోవిడ్-19 యొక్క లక్షణాలు ఏమిటి?
కోవిడ్-19 యొక్క సాధారణ లక్షణాలు జ్వరం, అలసట మరియు పొడిదగ్గు. కొంతమందిలో శరీర నొప్పులు, జలుబు, ముక్కు దిబ్బడ, గొంతు, తలనొప్పి మరియు డయేరియా, రుచి తెలియకపోవడం, చర్మంపై దద్దుర్లు, వేళ్లు లేదా కాలి గోళ్లు రంగు మారడం వంటి లక్షణాలు  క్రమక్రమంగా కనిపిస్తాయి. కొంతమందిలో ఈ వైరస్ ఉన్నప్పటికీ పై లక్షణాలేవి కనిపించవు. వారు సాధారణంగానే కనపడతారు. 

చాలా మంది (80% కు పైగా) ఎటువంటి ప్రత్యేక వైద్యాన్ని తీసుకోకుండానే ఈ వ్యాధినుండి బయట పడతారు. కోవిడ్-19 సోకిన ప్రతి ఐదుగురిలో ఒకరు మాత్రమే తీవ్రమైన అనారోగ్యానికి గురవుతారు.  ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. వృద్దులు మరియు హైబీపీ, గుండె సమస్యలు, మధుమేహం వంటి వ్యాధులతో బాధపడేవారు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతారు. జ్వరం, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడేవారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
 
నాకు కోవిడ్-19 లక్షణాలు ఉంటే ఏమి చేయాలి? నేను ఎప్పుడు వైద్య సంరక్షణ తీసుకోవాలి?
పొడి దగ్గు లేదా తేలికపాటి జ్వరం వంటి చిన్న లక్షణాలు ఉంటే, సాధారణంగా వైద్య సహాయం పొందవలసిన అవసరం లేదు. ఇంట్లో కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి. వీలైతే ప్రత్యేక గదిలో ఉండడం మంచిది. తరచూ మీ శరీరంలో కలగే లక్షణాలను పర్యవేక్షించుకోండి. 

ఒకవేళ మీరు మలేరియా లేదా డెంగ్యూ జ్వరాలు వ్యాప్తిస్తున్న ప్రాంతంలో నివసిస్తుంటే మీరు జ్వరం లక్షణాలను తక్కువ అంచనా వేయవద్దు. వెంటనే వైద్య సహాయం తీసుకోండి. 
 
కోవిడ్-19 ఎలా వ్యాపిస్తుంది?
కోవిడ్-19 తో బాధపడుతున్న వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చే తుంపర్లు ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ తుంపర్లు ఏవైనా వస్తువులపై లేదా ఆ మనిషి చుట్టూ మాత్రమే ఉంటాయి. ఇతరులు ఈ వస్తువులను లేదా ఆ మనిషి దగ్గరికి వచ్చి తాకిన తరువాత తన కళ్ళు, ముక్కు లేదా నోటిని తాకడం ద్వారా తనలో కూడా ఈ వైరస్ ప్రవేశిస్తుంది.

కోవిడ్-19 వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినపుడు వచ్చే తుంపర్ల బిందువులు డోర్క్‌నోబ్‌లు మరియు హ్యాండ్‌రైల్స్ వంటి వ్యక్తి చుట్టూ ఉన్న వస్తువులు మరియు ఉపరితలాలపై పడతాయి. ఈ వస్తువులు లేదా ఉపరితలాలను తాకడం, తరువాత వారి కళ్ళు, ముక్కు లేదా నోటిని తాకడం ద్వారా ప్రజలు వ్యాధి బారిన పడతారు.  
 
కోవిడ్-19 తో బాధపడుతున్న వ్యక్తుల మలం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందా?
కోవిడ్-19 తో బాధపడుతున్న వ్యక్తుల మలం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందడానికి ఉన్న అవకాశాలు చాలా తక్కువ. ప్రాధమిక పరిశోధనలు మలంలో ఈ వైరస్ ఉండవచ్చునని సూచిస్తున్నప్పటికీ దీని ద్వారా వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువ. అయినప్పటికీ బాత్‌రూమ్‌ను ఉపయోగించిన తరువాత మరియు భోజనం చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
 
నన్ను నేను కాపాడుకోవడానికి, వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఏమి చెయ్యాలి?

కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వైరస్ సోకకుండా మరియు కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా చెయ్యవచ్చు:
1: ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ లేదా సబ్బు మరియు నీటిని ఉపయోగించి తరచుగా చేతులను కడుక్కోవాలి. ఎందుకంటే, ఇలా చెయ్యడం ద్వారా మీ చేతులపై ఉన్న వైరస్‌లు చనిపోతాయి.

2: ఎవరైనా దగ్గుతున్నా లేదంటే తుమ్మతున్న వారి నుండి కనీసం 1 మీటర్ (3 అడుగుల) దూరంలో ఉండండి. ఎందుకంటే, ఎవరైనా దగ్గినప్పుడు లేదంటే తుమ్మినప్పుడు వారు ఈ వైరస్ ఉన్న తుంపర్లను వెదజల్లుతారు. మీరు దగ్గరగా ఉంటే, ఆ తుంపర్లను పీల్చడం ద్వారా ఈ వైరస్ మీలో ప్రవేశిస్తుంది.

3: మీ కళ్ళను, ముక్కును మరియు నోటిని తాకొద్దు. ఎందుకంటే, చేతులతో చాలా వస్తువులను తాకడం ద్వారా వైరస్ మీ చేతులపై ఉంటుంది. అలా కలుషితమైన మీ చేతులతో ముక్కును, కళ్ళను లేదా నోటిని తాకడం ద్వారా ఈ వైరస్ మీలో ప్రవేశిస్తుంది.

4: మీరు మరియు మీ చుట్టూ ఉన్నవారు పరిశుభ్రత పాటించేటట్లు చూసుకోండి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మోచేతిని లేదా టిష్యూ పేపర్‌ను అడ్డుపెట్టుకోవడం. తరువాత టిష్యూ పేపర్‌ను క్లోజ్ చేసే వీలున్న డస్ట్‌బిన్‌లో వెయ్యండి. ఎందుకంటే తుంపర్లు, వైరస్‌ను వ్యాప్తి చేస్తాయి. ఇలాంటి పరిశుభ్రమైన అలవాట్లను పాటించడం ద్వారా జలుబు, ఫ్లూ మరియు కోవిడ్-19 వంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా చెయ్యవచ్చు.

5: మీకు ఆరోగ్యం బాగోలేకపొతే ఇంటిలోనే ఉండండి. మీకు జ్వరం, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే కాల్ చేసి డాక్టర్‌ను వెంటనే సంప్రదించండి. హెల్త్ అథారిటీ చెప్పిన సూచనలు పాటించండి. ఎందుకంటే, జాతీయ మరియు స్థానిక అథారిటీల వద్ద మీరున్న ప్రాంతానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. ముందుగా కాల్ చెయ్యడం వలన మీ హెల్త్ కేర్ ప్రొవైడర్ మిమ్మల్ని వెంటనే సంబంధిత ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్తారు. దీని వలన వైరస్ మరియు ఇతర ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందకుండా ఉంటాయి.

6: కోవిడ్-19 యొక్క తాజా సమాచారం గురించి (కోవిడ్-19 ఎక్కువగా ఉన్న నగరాలు మరియు ప్రదేశాలు గురించి) తెలుసుకుంటూ ఉండండి. వీలైతే, ఈ ప్రదేశాలకు వెళ్ళకండి - ముఖ్యంగా మీరు వృద్దులు లేదా మధుమేహం, గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతుంటే అస్సలు వెళ్ళద్దు. ఎందుకంటే, ఈ ప్రదేశాల ద్వారా కోవిడ్-19 వ్యాప్తి చెందే అవకాశాలు చాలా ఎక్కువ.
 
పిల్లలు లేదా యువకులు కోవిడ్-19 బారిడనపడితే? 
పిల్లలు మరియు యుక్త వయస్సులో ఉన్నవారిలో కోవిడ్-19 లక్షణాలు సాధారణంగానే ఉంటాయి. ఏమైనప్పటికీ, ప్రతి ఐదుగురిలో ఒకరికి తీవ్ర అనారోగ్యం ఉంటుంది, వారు వెంటనే హాస్పిటల్‌లో చేరాలి. అందుకే కోవిడ్-19 మనల్ని మరియు మనకు కావాల్సిన వారిని ఎంత మేరకు అనారోగ్యానికి గురిచేస్తుందనే సందేహాలు ఉంటాయి. ముందుగా చెయ్యాల్సినది, తరచుగా చేతులు కడుక్కోవడం మరియు పరిశుభ్రముగా ఉండడం. రెండవది, ప్రయాణాలలో మరియు ఎక్కువ మందిని కలిసే చోట అధికారుల సూచనలను పాటించడం మంచిది.
 
కోవిడ్-19 నివారణకు యాంటీ బయోటిక్స్ ఉపయోగపడతాయా?
లేదు. యాంటీ బయోటిక్స్, బాక్టీరియాతో పోరాడగలవు కానీ వైరస్‌తో పోరాడలేవు. కోవిడ్-19 వైరస్ వలన వస్తుంది కాబట్టి యాంటీ బయోటిక్స్ పని చేయవు. కోవిడ్-19 సోకకుండా యాంటీ బయోటిక్స్‌ను ఉపయోగించకూడదు. వాటిని కేవలం డాక్టర్ సూచన మేరకు మాత్రమే బాక్టీరియాల్ ఇన్ఫెక్షన్స్‌కు ఉపయోగించాలి.
 
కోవిడ్-19 సోకకుండా ఉండడానికి మరియు నివారణకు ఏవైనా మందులు ఉన్నాయా?
కొన్ని సాంప్రదాయ, ఇంటి చిట్కాలు వలన కోవిడ్-19 యొక్క లక్షణాలు సోకకుండా జాగ్రత్తపడవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న మందులు ఈ వ్యాధి సోకకుండా మరియు నివారణకు ఉపయోగపడినట్లు ఆధారాలు లేవు. చాలా పరిశోధనలు దీని మీద జరుగుతున్నాయి.
 
కోవిడ్19కి టీకా, మందు లేదా చికిత్స ఉందా?
ఇంకా లేదు. నేటి వరకు కోవిడ్-19 కు సంబంధించి వాక్సిన్ మరియు మందులు లేదా చికిత్స లేవు. అయితే, వ్యాధి సోకిన వారికి, వ్యాధి లక్షణాలకు సంబంధించిన చికిత్స చేస్తారు. తీవ్ర అనారోగ్య లక్షణాలు ఉన్నవారు వెంటనే హాస్పిటల్‌లో చేరాలి. తగు రక్షణ చర్యల వల్ల చాలా మందికి నయం అవుతోంది.

కొన్ని మందుల మీద పరిశోధన జరుగుతోంది. వాటిని క్లినికల్ ట్రయల్స్‌గా పరీక్షించారు. చేతులను తరచుగా కడుక్కోవడం, తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు మోచేతిని అడ్డుపెట్టుకోవడం, ఇతరులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు కనీసం 1 మీటర్ (3 అడుగులు) దూరంలో ఉండడం వలన కోవిడ్-19 సోకకుండా నివారించవచ్చు.
 
కోవిడ్-19 నుండి మిమ్మల్ని మరియు ఇతరులను రక్షించుకోవడానికి ముఖ్యమైన మార్గాలు:
1. మీ చేతులను తరచుగా మరియు పూర్తిగా శుభ్రపరచండి
2. మీ కళ్ళు, నోరు మరియు ముక్కును తాకడం మానుకోండి
3. దగ్గుతున్నపుడు, తుమ్మేటప్పుడు మీ మోచేయినిగానీ లేదా హ్యాండ్ కర్చీఫ్ గానీ అడ్డుపెట్టుకోవాలి. ఆ వెంటనే మీ చేతులను సబ్బుతోగానీ, శానిటైజర్ తోగానీ శుభ్రం చేసుకోవాలి. 
4. ఇతరుల నుండి కనీసం 1 మీటర్ దూరం పాటించండి.
 
మాస్క్ ఎలా వేసుకోవాలి.. వాడాలి.. దానిని ఎలా పారేయాలి?
1. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి తప్పనిసరిగా మాస్కు ధరించాలి. ముఖ్యంగా వైద్యులు, హెల్త్ వర్కర్స్, కేర్ టేకర్స్, జ్వరం, దగ్గు ఇలాంటి లక్షణాలు ఉన్న వారు మెడికల్ మాస్కు వాడాలి.
2. మాస్క్‌ని ముట్టుకునే ముందు ప్రతి ఒక్కరూ ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ రబ్ లేదా సబ్బుతో చేతులని శుభ్రం చేసుకోవాలి.
3.మాస్క్ వాడే ముందు దానికి రంధ్రాలు కానీ, చిరుగుళ్లు ఉన్నాయేమో చూడాలి.
4. మాస్క్ ఎటువైపు కరెక్ట్‌గా ఉందో చూసి వాడాలి. ఏది పై భాగమో కలర్‌ని చూస్తే తెులసుకోవచ్చు.
5. మాస్క్ మీ ముఖంపై కర్టెక్ట్‌గా పెట్టుకోండి. ఈ సమయంలో స్ట్రిప్ భాగం మీ ముక్కుపై ఉండేలా ఉంటే సరిగ్గా వాడుతున్నట్లు.
6. ఇప్పుడు మాస్క్‌ని కిందికి లాగితే అది మీ నోరు, గవద భాగాన్ని కవర్ చేస్తుంది.
7. మాస్క్ వాడిన తర్వాత దానిని ఎలాస్టిక్ లూప్స్.. అంటే మనం చెవులకి తగిలించే దారాలతో మెల్లిగా తీయాలి.. అంతే కానీ, మధ్యభాగంలో పట్టుకోవద్దు.. అలా తీసి పారేయాలి.
8. తీసేసిన మాస్క్‌ని వెంటనే చెత్తకుండిలో పారేయండి.
9. అదే విధంగా మాస్క్‌ తీసిన తర్వాత చేతులని మరోసారి శుభ్రంగా ఆల్కహాల్ బేస్డ్ వాష్‌తో, సబ్బుతో కానీ చేతులని శుభ్రం చేసుకోవాలి.
 
కోవిడ్-19 లక్షణాలు కనిపించేందుకు ఎంత సమయం పడుతుంది?
ఇప్పడు ఉన్న సమాచారం ప్రకారం కోవిడ్-19 లక్షణాలు తెలుసుకోవడానికి 1 నుంచి 14 రోజుల సమయం పడుతుంది. 5 రోజుల్లోనూ చాలా విషయాలు తెలుసుకోవచ్చు.
 
మన పెంపుడు జంతువులలో కోవిడ్ 19‌ని గుర్తించొచ్చా?
లేదు, పెంపుడు జంతువులు, జంతువుల్లో అంటే కుక్కలు, పిల్లులకి కోవిడ్ 19 సోకినట్లు ఆ లక్షణాలు ఉన్నట్లు ఎక్కడా నిర్ధారించలేదు.
 
ఉపరితలాలపై వైరస్ ఎంతకాలం జీవించి ఉంటుంది?
కోవిడ్-19కి కారణమయ్యే వైరస్ కొన్ని ఉపరితలాల (గ్లాస్ మరియు ప్లాస్టిక్) పై సుమారు 72 గంటల వరకు ఉంటుంది అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటివరకు జరిగిన అధ్యయనాల ప్రకారం కొన్ని గంటల నుండి కొద్ది రోజుల వరకు ఉపరితలాలపై కొరోనా వైరస్ ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు కూడా తెలిపారు.

ఇది వేర్వేరు పరిస్థితుల్లో మారుతుంటుంది. ఉదాహారణకి ఉపరితలాలపై ఓ రకంగా, ఉష్ణోగ్రత, పర్యావరణాల్లో ఓ రకంగా ఉంటుంది. ఏ ఉపరితలాలపై ఉందా అని అనుకుంటే ఆ సమయంలో మిమ్మల్ని మీరు కాపాడుకోవాలనుకుంటే మీ చేతులని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.  
 
కిరాణా దుకాణాలకు సురక్షితంగా వెళ్లడం ఎలా?
కిరాణా షాపులకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కును ధరించాలి. ఇతరుల నుండి కనీసం 1 మీటర్ దూరం పాటించండి. వీలైనంత వరకు ఆన్ లైన్ లావాదేవీలకు ప్రాధానత్య ఇవ్వండి. ఇంటికి వచ్చాక మీ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. మీరు కొనుగోలు చేసిన ఉత్పత్తులను కూడా శానిటైజ్ చేయండి.  
 
పండ్లు మరియు కూరగాయలను ఎలా కడగాలి?
పండ్లు మరియు కూరగాయలు ఆరోగ్యకరమైన ఆహారంలో ముఖ్యమైన భాగాలు. పండ్లు, కూరగాయాలను బయటి నుంచి తీసుకురాగానే వాటిని నీటితో శుభ్రంగా కడగాలి.
 
కోవిడ్-19 పరీక్ష ఎలా చెయ్యబడుతుంది?
కరోనా వైరస్ టెస్టింగ్ కోసం మీ గొంతు మరియు నాసికలను పరీక్షిస్తారు. మీ సాంపిల్స్‌ను తీసుకొని నోడల్ హాస్పిటల్స్‌కు పంపిస్తారు అలానే మీ శారీరక ఆరోగ్యాన్ని పరీక్షించి హాస్పిటల్‌లో చేరవలసిన అవసరం గురించి చెప్తారు. లేదంటే, మిమ్మల్ని ఇంటిలోనే ఐసోలేట్ (నిర్బంధం) లో ఉండమని చెప్తారు. టెస్ట్‌లో పాజిటివ్ వస్తే, మీరు కనీసం 14 రోజులు, లేదంటే పూర్తిగా తగ్గేంతవరకు క్వారంటైన్‌లో ఉండాలి.
 
కోవిడ్-19 నుండి కోలుకున్న తరువాత మరల కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వస్తుందా?
అది ప్రస్తుతానికి తెలియదు. చైనా నుండి వచ్చిన కొన్ని రిపోర్టుల ప్రకారం, కొంతమంది కోవిడ్-19 నుండి కోలుకొని మరల ఆ వైరస్ బారిన పడ్డారు. అయితే అది కొత్త ఇన్ఫెక్షన్ లేదంటే ముందటి వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గలేదా అనే విషయం గురించి తెలియదు. సీటెల్‌లోని ఫ్రెడ్ హచిన్సన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు, వైరస్ యొక్క డిఎన్ఏ ప్రతీ 15 రోజులకొకసారి కొద్దిగా మారుతుందని చెప్పారు. ఈ వైరస్‌లో ఎంతమేరకు ఇలాంటి మార్పులు జరుగుతాయని ఇంకా తెలియదు.
 
ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి మనల్ని కరోనా వైరస్ నుండి కాపాడుతుందా?
ఒక వ్యక్తి యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థపై ఆధారపడి వైరస్ ప్రభావాలు కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం, వృద్దులు మరియు ఇదివరకే వేరే వ్యాధులతో బాధపడుతున్నవారు ఎక్కువగా ఈ వైరస్ బారిన పడవచ్చు.

వృద్ధాప్యం మరియు తక్కువ వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉన్న వారు కోవిడ్-19 తో పోరాడడం చాలా కష్టంగా ఉంటుంది. గుండె జబ్బులు, మధుమేహం లేదా ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నవారు ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు తక్కువ వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటారు మరియు ఈ వైరస్‌తో పోరాడలేరు. యువత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి.