సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 జనవరి 2022 (11:16 IST)

దేశంలో ఫిబ్రవరి నాటికి థర్డ్ వేవ్ ఉధృతి

ప్రపంచ దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. ప్రస్తుతం ఒమిక్రాన్‌ వ్యాప్తి దేశంలో దడ పుట్టిస్తోంది. థర్డ్‌ వేవ్‌ కచ్చితంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా థర్డ్‌ వేవ్‌ భారత దేశంలో ఫిబ్రవరి నాటికి గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని ఐఐటీ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్  అభిప్రాయపడ్డారు. 
 
దేశంలో రోజుకు 1-1.5 లక్షల కేసులు నమోదవుతాయని అంచనా వేశారు. ఓ జాతీయ మీడియాతో మనీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ... 'కొత్త వేరియంట్‌తో ఫిబ్రవరి నాటికి దేశంలో థర్డ్‌ వేవ్‌ పీక్ స్టేజ్ చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం. జనవరి నుంచే థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచివుంది. అయితే సెకండ్ వేవ్ కంటే కాస్త తక్కువగానే ఉంటుంది. ఓమిక్రాన్ యొక్క తీవ్రత డెల్టా వేరియంట్‌లో కనిపించే దానిలా లేదు. దక్షిణాఫ్రికాలో నమోదైన కేసులపై నిశితంగా పరిశీలిస్తున్నాం' అని తెలిపారు. 
 
ప్రస్తుతం దక్షిణాఫ్రికా కొత్త కేసులు ఎక్కువగా నమోదవడం లేదు. ఇది కాస్త సంతోషించాల్సిన విషయం. కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ అధిక ట్రాన్స్‌మిసిబిలిటీని చూపించినప్పటికీ.. దాని తీవ్రత డెల్టా వేరియంట్‌ కంటే తక్కువగానే ఉండనుంది. దేశంలో లాక్‌డౌన్‌ అవసరం లేదు. తేలికపాటి లాక్‌డౌన్ (రాత్రి కర్ఫ్యూ) సరిపోతుంది. 
 
జనసమూహాల నియంత్రణ ఆంక్షల ద్వారా దీని తీవ్రతను అదుపు చేయవచ్చు' అని మనీంద్ర అగర్వాల్ సూచించారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశ ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. మాస్కులు ధరించడం, సామజిక దూరం పాటించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 
 
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావాన్ని గణితశాస్త్ర పరంగా అంచనా వేశారు. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తోన్న 'సూత్ర మోడల్‌'ను వినియోగించారు. అయితే ఆ సమయంలోనే పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మణిపూర్‌, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ముందస్తు చర్యలపైనే కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ వ్యాప్తి, ప్రభావం ఆధారపడి ఉంటుందన్నారు.