శుక్రవారం, 8 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (09:51 IST)

ఆస్ట్రేలియాకు తేరుకోలేని షాకిచ్చిన బంగ్లాదేశ్

ఆస్ట్రేలియాకు క్రికెట్ పసికూన బంగ్లాదేశ్ తేరుకోలేని షాకిచ్చింది. ఐదు టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన మూడో టీ20లో ఆసీస్‌పై 10 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. 
 
తద్వారా ఆస్ట్రేలియాపై తొలిసారిగా వరుసగా మూడు టీ20లలో బంగ్లాదేశ్ గెలిచింది. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఆస్ట్రేలియాపై సిరీస్‌ నెగ్గడం బంగ్లాదేశ్‌కు ఇదే తొలిసారి కావడం గమనార్హం. తొలుత బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు చేసింది. కెప్టెన్ మహ్మదుల్లా (53) రాణించాడు.
 
అనంతరం ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 117 పరుగులు మాత్రమే చేసింది. మిచెల్ మార్ష్ (51) రాణించినా మిగతా బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. కాగా ఈ మ్యాచ్‌తో ఆసీస్ తరఫున టి20ల్లో అరం గేట్రం చేసిన నాథన్‌ ఎలీస్‌… తొలి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ సాధించాడు. 
 
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో బౌలింగ్‌ వచ్చిన అతడు చివరి మూడు బంతుల్లో వరుసగా… మహ్ముదుల్లా, ముస్తఫిజుర్, మెహదీ హసన్‌లను అవుట్‌ చేసి హ్యాట్రిక్‌ పూర్తిచేశాడు. అరంగేట్రంలో హ్యాట్రిక్‌ నమోదు చేసిన తొలి బౌలర్‌గా ఎలీస్‌ ఘనతకెక్కాడు. ఓవరాల్‌గా టీ20ల్లో ఇది 17వ హ్యాట్రిక్‌ కావడం గమనార్హం.