ఆ షాట్ ఆడుతూ చాలాసార్లు ఔటయ్యాను.. అదే నా వీక్నెస్ : విరాట్ కోహ్లి
భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తనలోని బలహీనతను తాజాగా బహిరంగ పరిచాడు. ఇటీవలికాలంలో కోహ్లి కవర్ డ్రైవ్ కోసం ప్రయత్నిస్తూ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం అద్భుతమైన కవర్ డ్రైవ్ షాట్‌లతో ఆలరిస్తూనే, సెంచరీ నమోదు చేశాడు. దీనిపై కోహ్లీ స్పందించారు.
బీసీసీఐ పోస్ట్ చేసిన వీడియోలో కోహ్లీ మాట్లాడుతూ, గత కొన్నాళ్లుగా కవర్ డ్రైవ్ తన వీక్నెస్‌గా మారిందన్నారు. కవర్ డ్రైవ్ ఆడబోయి చాలాసార్లు ఔట్ అయ్యానని, కానీ అదే షాట్‌తో తాను చాలా రన్స్ చేసినట్టు గుర్తుచేశాడు. పాకిస్థాన్‌పై తొలి రెండు బౌండరీలు కవర్ డ్రైవ్ ద్వారానే వచ్చాని చెప్పాడు. అలాంటి షాట్స్ ఆడినపుడు బ్యాటింగ్ నియంత్రణలోనే ఉన్నట్టు అనిపిస్తుందన్నారు. వ్యక్తిగతంగా ఇది తనకు మంచి ఇన్నింగ్స్ అని టీమిండియాకు ఇది మంచి విజయమని, తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.