ధోనీ వల్లే అవుట్ అయ్యాను.. గౌతం గంభీర్ (video)
2011 ప్రపంచ కప్‌లో తాను సెంచరీ సాధించబోతున్నాననే విషయాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గుర్తుచేయకుంటే తాను అవుట్ అయ్యే వాడిని కాదని టీమిండియా ప్లేయర్ గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు.
గత ఏడాది డిసెంబరులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి.. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా మారిన గంభీర్.. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2011వ సంవత్సరం ప్రపంచ కప్‌లో సెంచరీని చేజార్చుకోవడానికి ధోనీనే కారణమన్నాడు.
క్రీజులో వున్న తనకు 97 పరుగులు సాధించాననే విషయం తెలియదు. తన వ్యక్తిగత స్కోరు గురించి తాను ఆలోచించలేదు. తన లక్ష్యం శ్రీలంకను ఓడించాలనే దానిపైనే వున్నది. ఆ సమయంలో ధోనీ తన వద్దకు వచ్చి.. ప్రస్తుతం 97 పరుగులు సాధించారు. సెంచరీ కొట్టేందుకు ఇంకా మూడు పరుగులు మాత్రమే వున్నాయని చెప్పారన్నాడు.
ధోనీ నుంచి సెంచరీకి 3 పరుగులే వున్నాయని తెలిసేవరకు మామూలుగా వున్నాను. అయితే ఆ తర్వాత తడబడ్డాను. టెన్షన్‌లో సెంచరీని మిస్ అయ్యాను. ఒకవేళ ధోనీ అలా సెంచరీ సాధించబోనున్న విషయాన్ని గుర్తు చేయకుండా వుండి వుంటే ఒత్తిడి లోనుకాకుండా సెంచరీని పూర్తి చేసివుంటానని గంభీర్ వ్యాఖ్యానించాడు.