శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2023 (14:54 IST)

అలాంటి వారంతా ఐపీఎల్‌కు దూరంగా ఉండాలి : రవిశాస్త్రి

ravi shastri
ఐసీసీ ప్రపంచ కప్ పోటీలకు సమయం సమీపిస్తుంది. కానీ, భారత శిబిరంలో గాయాల బెడద ఆందోళన కలిగిస్తుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషభ్‌ పంత్ ఎప్పటికి కోలుకుంటాడనే దానిపై స్పష్టత లేదు. గాయాల కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా, శ్రేయస్ అయ్యర్‌ అందుబాటులోకి రావడానికి కనీసం నాలుగైదు నెలల సమయం పట్టే అవకాశముంది.
 
ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీలో స్టార్‌ ఆటగాళ్లలందరూ ఆడనున్నారు. ఈ సమయంలో వీరంతా తమ ఫిట్నెస్‌ కాపాడుకోవడం ముఖ్యం. ఈ నేపథ్యంలో భారత మాజీ కోచ్‌ రవిశాస్త్రి బీసీసీఐకి కీలక సూచన చేశాడు. ప్రపంచకప్‌ని దృష్టిలో ఉంచుకుని కీలక ఆటగాళ్ల మ్యాచ్‌ల భారాన్ని తగ్గించేందుకు  ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలతో బీసీసీఐ, ఆటగాళ్లు మాట్లాడాలని చెప్పాడు. అవసరమైతే ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడకూడదని సూచించాడు.
 
'కీలక ఆటగాళ్లు గాయాల బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మేం క్రికెట్‌ ఆడినప్పుడు ఇన్ని సదుపాయాలు లేవు. అయినా, 8-10 సంవత్సరాలు సులభంగా ఆడటం మీరు చూశారు. చాలా మంది ఏడాదిలో 8-10 నెలల పాటు ఆడేవారు. ప్రస్తుతం అప్పటి కంటే ఎక్కువ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. 
 
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లీగ్‌ల్లో ఆటగాళ్లు భాగం కావడంతో వారి విశ్రాంతి సమయం తగ్గుతోంది. బీసీసీఐ, ఆటగాళ్లు కూర్చొని చర్చించుకోవాలి. మీకు క్రికెట్‌ చాలా అవసరం. అదేసమయంలో విశ్రాంతి కూడా ముఖ్యం. అవసరమైతే ఐపీఎల్‌లో ఆడకండి. బీసీసీఐ బాధ్యత తీసుకుని.. 'ఈ ఆటగాళ్లు మాకు కావాలి. భారత్‌కు వీరి సేవలు అవసరం. వారు ఈ మ్యాచ్‌లు (ఐపీఎల్‌) ఆడకపోతే బాగుంటుంది' అని ఫ్రాంచైజీలతో చెప్పాలి" అని రవిశాస్త్రి వివరించాడు.