గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 28 జూన్ 2024 (09:36 IST)

పదేళ్ల నిరీక్షణకు స్వస్తి... టైటిల్ వేటకు మరో అడుగు దూరంలో భారత్!!

team india
ఐసీసీ మెగా ఈవెంట్‌లో తుది పోరుకు చేరేందుకు భారత్ పదేళ్ళ నిరీక్షణకు తెరపడింది. దీంతో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను ముద్దాడేందుకు మరో అడుగు దూరంలో నిలించింది. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా ఈవెంట్‌లో భాగంగా, ఈ నెల 29వ తేదీన ఫైనల్ పోరు జరుగనుంది. అయితే, గురువారం రాత్రి రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడగా, ఇందులో రోహిత్ శర్మ సేన విజయభేరీ మోగించింది. ఫలితంగా పొట్టి క్రికెట్‍‌లో విశ్వవిజేతగా నిలిచేందుకు ఒకే ఒక్క అడుగు దూరంలో నిలించింది. 
 
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసి భారత్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఇంగ్లండ్ చతికిలపడింది. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ సత్తా చాటడంతో 16.4 ఓవర్లలో కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 68 పరుగుల భారీ విజయాన్ని సాధించింది. బ్యాటింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ (57), సూర్య కుమార్ యాదవ్ (47) సత్తా చాటి భారత విజయానికి దోహదపడ్డారు. ఇక అత్యంత కీలకమైన వికెట్లు తీసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చిన స్పిన్నర్ అక్షర్ పటేలు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
 
భారత్ బ్యాటింగ్ విషయానికి వస్తే కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి ఆదుకున్నాడు. ఆరంభంలోనే విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ వికెట్లను కోల్పోయినప్పటికీ జాగ్రత్తగా 57 పరుగులు బాదాడు. సూర్యకుమార్ యాదవ్తో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మిగతా బ్యాటర్లలో సూర్య కుమార్ యాదవ్ 47, హార్ధిక్ పాండ్యా 23, విరాట్ కోహ్లి 9, పంత్ 4, రవీంద్ర జడేజా 17(నాటౌట్), శివమ్ దూబే 0, అక్షర్ 10, అర్షదీప్ సింగ్ 1 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారత్ 171 పరుగులు నమోదు చేసింది. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టగా.. టాప్లీ, ఆర్చర్, సామ్ కరాన్, అదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.
 
మరోవైపు, 172 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇంగ్లండ్ ఆరంభం పర్వాలేదనిపించిన అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలానికి ఆ జట్టు లైనప్ కుదేలైంది. 26 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఆ జట్టు ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 103 పరుగులకే ఆలౌట్ అయింది. 25 పరుగులు చేసిన హ్యారీ బ్రూక్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 
 
మిగతా బ్యాటర్లలో జాస్ బట్లర్ 23, ఫిలిప్ సాల్ట్ 5, మొయిన్ అలీ 8, జానీ బెయిర్ స్టో 0, సామ్ కరాన్ 2, లివింగ్ స్టోన్ 11, క్రిస్ జోర్డాన్ 1, జోఫ్రా ఆర్చర్ 21, అదిల్ రషీద్ 2, రీస్ టాప్లీ 3(నాటౌట్) చొప్పున వికెట్లు తీశారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీశారు. ఇక స్టార్ పేసర్ బుమ్రా రెండు వికెట్లు తీయగా.. మరో రెండు వికెట్లు రనౌట్ రూపంలో వచ్చాయి.
 
కాగా, ఈ పొట్టి క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జూన్ 29వ తేదీన బ్రిడ్జ్ టౌన్‌లో జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. కాగా ఈ రెండు జట్లు టోర్నీ ఒక్క ఓటమిని కూడా చవిచూడలేదు. దక్షిణాఫ్రికా వరసగా 8 మ్యాచ్‌లలో గెలవగా.. భారత్ 7 విజయాలు సాధించింది. టీమిండియా ఆడాల్సిన ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఇలా ఈ టోర్నీలో ఒక్క ఓటమిని కూడా చవిచూడని రెండు జట్ల మధ్య అంతిమ పోరు జరుగనుంది.