ఆఖరి టీ20కి వర్షం అంతరాయం తప్పదా?
ఐదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో భాగంగా ఆదివారం నిర్ణయాత్మక ఐదో టీ 20 మ్యాచ్ జరుగనుంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌లో భారత్, సౌతాఫ్రికా జట్లూ తలా రెండేసి మ్యాచ్‌లలో విజయం సాధించి సమ ఉజ్జీలుగా నిలిచాయి. దీంతో నిర్ణయాత్మక చివరి టీ20 మ్యాచ్ ఆదివారం రాత్రి బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగనుంది.
అయితే, మ్యాచ్ జరిగే సమయంలో చిన్నస్వామి స్టేడియం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతం కానుంది. దీంతో మ్యాచ్‌కు పలుమార్లు వర్షం అడ్డంకిగా మారే వీలుంది. ఇప్పటికే వారం రోజులుగా బెంగళూరులో వర్షం కురుస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ - బెంగాల్, ముంబై - ఉత్తర్ ప్రదేశ్ మ్యాచ్‌లకు కూడా ఇబ్బంది కలిగింది. ఇక ఇప్పటికే ఈ సిరీస్ 2-2తో సమానంగా మారింది. దక్షిణాఫ్రికా జట్టు తొలి రెండు మ్యాచ్‌లు గెలుపొందగా టీమ్ ఇండియా గత రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. దీంతో నిర్ణయాత్మకమైన ఐదో టీ20పై ఆసక్తి పెరిగింది. మరి ఈ మ్యాచ్ సజావుగా సాగుతుందో లేదో చూడాలి.
ఇకపోతే, చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాట్స్‌మెన్, బౌలర్లకు సమానంగా సహకరిస్తుంది. ఇక్కడి పిచ్, చిన్న బౌండరీలు బ్యాట్స్‌మెన్‌కు కలిసొచ్చేవే. అయితే ఈ మైదానంలో మరీ భారీ స్కోర్లు నమోదు కావు. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 155. స్పిన్నర్లకు పిచ్ బాగా అనుకూలిస్తుంది.