శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 అక్టోబరు 2021 (08:45 IST)

టచ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ : టీ20 వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చిత్తు

భారత క్రికెట్ జట్టు ఓపెన్ రోహిత్ శర్మ టచ్‌లోకి వచ్చారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్‌లలో భాగంగా బుధవారం ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. దీంతో 2.1 ఓవర్లు మిగిలివుండగానే విజయాన్ని అందుకుంది. 
 
బుధవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. స్మిత్ 57, మ్యాక్స్‌వెల్ 37, స్టోయినిస్ 41 పరుగులు (నాటౌట్) చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్ చెరో వికెట్ తీసుకున్నారు.
 
ఆ తర్వాత 153 పరుగుల విజయ లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి మరో 2.1 ఓవర్లు ఉండగానే చేరుకుంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసి అవుట్ కాగా మరో ఓపెనర్ రోహిత్ శర్మ 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ 38, హార్దిక్ పాండ్యా 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
 
మరోవైపు, టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం రెండు మ్యాచ్‌లు జరిగాయి. గ్రూప్-ఏ లో శ్రీలంక-ఐర్లాండ్ పోటీ పడగా, శ్రీలంక 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇదే గ్రూప్‌లో నమీబియా-నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నమీబియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.