సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 23 నవంబరు 2019 (16:06 IST)

పింక్ టెస్టులో తొలి సెంచరీ : స్మిత్ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ

కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న డే అండ్ నైట్ (పింక్ టెస్ట్)లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడు. డే అండ్ నైట్ టెస్టులో తొలి సెంచరీ కాగా, తన టెస్ట్ కెరీర్‌లో ఇది 27వ సెంచరీ. తద్వారా 26 సెంచరీలతో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ పేరిట ఉన్న రికార్డు కోహ్లీ బ్రేక్ చేశాడు. 
 
బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం తెల్సిందే. ఇందులో విరాట్‌ కోహ్లీ పరుగుల సునామీ సృష్టిస్తున్నారు. దిగ్గజాలు నెలకొల్పిన రికార్డులను అలవోకగా బ్రేక్‌ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌(26 సెంచరీలు) రికార్డును విరాట్‌ తాజాగా అధిగమించాడు. 
 
టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా కింగ్‌ కోహ్లీ నిలిచాడు. టెస్టు సెంచరీల జాబితాలో ప్రస్తుతం 27 టెస్టు సెంచరీలతో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌, ఆస్ట్రేలియా మాజీ సారథి అలెన్‌ బోర్డర్‌తో కలిసి కోహ్లీ 17వ స్థానంలో కొనసాగుతున్నాడు. 
 
భారత్‌లోని ప్రముఖ టెస్టు స్టేడియాలైన ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వేదికల్లో గుండప్ప విశ్వనాథ్‌, సునీల్‌ గావస్కర్‌, సచిన్‌ టెండూల్కర్‌తో పాటు విరాట్‌ కోహ్లీ మాత్రమే టెస్టు సెంచరీలు సాధించారు.
 
కాగా, విరాట్ కోహ్లీ ఖాతాలో కెప్టెన్‌గా 20వ టెస్టు శతకం ఉండగా అతని కెరీర్‌లో మొత్తంగా 27వ సెంచరీ, అంతర్జాతీయ క్రికెట్లో 70వ శతకం డే నైట్‌ టెస్టులో తొలి సెంచరీలు ఉన్నాయి.