శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 4 ఆగస్టు 2018 (17:12 IST)

ఎడ్‌బాస్టన్‌ టెస్ట్ : చేతులెత్తేసిన కోహ్లీ సేన.. ఇంగ్లండ్ గెలుపు

ఎడ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయభేరీ మోగించింది. ఆ జట్టు నిర్దేశించిన 194 పరుగుల విజయలక్ష్యాన్ని చేరుకోలేక భారత్ ఆటగాళ్లు చతికిలపడ్డారు. ఫలితంగా తొలి టెస్టులో కోహ్లీ సేన ఓటమిని

ఎడ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయభేరీ మోగించింది. ఆ జట్టు నిర్దేశించిన 194 పరుగుల విజయలక్ష్యాన్ని చేరుకోలేక భారత్ ఆటగాళ్లు చతికిలపడ్డారు. ఫలితంగా తొలి టెస్టులో కోహ్లీ సేన ఓటమిని చవిచూసింది.
 
ఈ టెస్టులో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులు చేయగా, భారత్ 274 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 180 రన్స్‌కే ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ ముంగిట 194 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. దీన్ని ఛేదించే క్రమంలో ఎంతో నమ్మకం పెట్టుకున్న సారథి విరాట్‌ కోహ్లీ (51; 93 బంతుల్లో 4×4) అనూహ్యంగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. 
 
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. స్టోక్స్‌ వేసిన 46.3వ బంతిని అతడు ఎల్బీ అయ్యాడు. అదే ఓవర్‌ చివరి బంతిని కాస్తో కూస్తో పరుగులు చేయగల మహ్మద్‌ షమి(0)నీ స్టోక్స్‌ పెవిలియన్‌ పంపించడంతో భారత్‌ తీవ్ర ఒత్తిడిలో కూరుకుంది. 
 
ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన మిగిలిన ఆటగాళ్లు కూడా రాణించలేక పోయారు. ఫలితంగా భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ 31 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. 
 
భారత రెండో ఇన్నింగ్స్‌లో విజయ్ 6, ధవాన్ 13, రాహుల్ 13, కోహ్లీ 51, రహానే 2, అశ్విన్ 13, కార్తీక్ 20, పాండ్యా 31, షమి 0, ఇషాంత్ శర్మ 11, యాదవ్ 0 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్, బ్రాడ్‌లు రెండేసి వికెట్లు తీయగా, స్ట్రోక్ 4 వికెట్లు పడగొట్టాడు. కుర్రాన్, రషీద్‌లు ఒక్కో వికెట్ తీశారు. 
 
సంక్షిప్త స్కోరు... 
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ : 287 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ : 274 ఆలౌట్
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ : 180 ఆలౌట్. 
భారత్ రెండో ఇన్నింగ్స్ : 162 ఆలౌట్
ఫలితం.. ఇంగ్లండ్ 31 రన్స్ తేడాతో గెలుపు.